4 June, 2026 | 2:49 AM

చేసేది హెచ్చరిక.. అడిగేది సహకారం!

04-06-2026 02:17 AM

విన్నపాలు వినవలె వింతవింతలూ..

మీ సంగతి తేలుస్తానని.. సవినయంగా మనవి చేస్తున్నా..!

సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రం జోక్యం కోరడం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా చిత్రీకరిస్తూనే, కేంద్రం నుంచి సహకారం ఆశించడం విరుద్ధ సంకేతాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సమస్య పరిష్కారమే లక్ష్యమైతే నేరుగా చర్చలు జరపకుండా బహిరంగ లేఖల రాజకీయానికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నా రనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కిషన్ రెడ్డి ని కలిస్తే సమస్యల పరిష్కారానికి అవకా శం పెరుగుతుంది. కానీ అలా చేస్తే రాజకీయంగా కాంగ్రెస్ చేస్తున్న కేంద్ర వివక్ష ప్రచారం బలహీనపడుతుందనే కారణంతోనే ప్రభుత్వం దూరం పాటిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

‘తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సాగునీటి సమస్యలపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు లేఖ రాశాను. కానీ ఆయన ఇంకా స్పందించలేదు. అంతర్రాష్ట జల వివాదాలను ఆయా రాష్ట్రాల సీఎంలు పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచిం చారు. తుమ్మిడిహట్టి బరాజ్‌పై చర్చకు తక్షణమే సమయం ఇవ్వండి. లేకపోతే ఆ సమస్య తీవ్రమవుతుంది. అప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉప్పెనగా మారుతుంది. అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. సమస్య సృష్టిస్తే, నిర్లక్ష్యం చేస్తే, అవమానం చేస్తే తెలంగాణ ప్రాంతం ఊరుకోదు. అందుకే మహారాష్ట్ర సీఎంకు సవినయం గా విజ్ఞప్తి చేస్తున్నా.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. కిషన్‌రెడ్డి ఆలోచన ఏమిటో త్వరలోనే తేలుతదని హెచ్చరిక జారీ చేస్తున్నా’. అంటూ ఇటీవల ఆసిఫాబాద్ సభలో రేవంత్‌రెడ్డి వింతైన ప్రసంగం చేశారు.

అంతేకాదు, ‘రాష్ట్ర ప్రభుత్వం కొనుగో లు చేసిన ప్రతి గింజా కేంద్రమే కొనుగో లు చేయాలి. తడిసిన ధాన్యంతో సహా వడ్లు, మొక్కజొన్నలు, ఇతర ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలని కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించా ల్సి వస్తుందని చెప్పదలచుకున్నా. మీ సం గతి తేలుస్తా అని కిషన్‌రెడ్డికి సవియంగా విజ్ఞప్తి చేస్తున్నా. తుమ్మిడిహట్టి సమస్య అయినా, ధాన్యం కొనుగోలు సమస్య అయినా  బాధ్యత కిషన్‌రెడ్డి తీసుకోకపోతే తెలంగాణ తిరగడానికి ఆయనకు సమస్య అవుతుందని సవియంగా విజ్ఞప్తి చేస్తు న్నా’.. అని కూడా సీఎం హెచ్చరికలు, విజ్ఞప్తులు కలగలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ వైఖరిపై విమర్శలు కేంద్రం చేతుల్లోనే ధాన్యం కొనుగోలు, తుమ్మిడిహట్టి, మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్, మూసీ ప్రాజెక్టు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నేరుగా చర్చించకుండా బహిరంగ లేఖలు!

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ఇటీవలి కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నది. కేంద్ర ప్రభు త్వం తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ బహిరంగ సభల్లో తీవ్రస్థాయి లో విమర్శలు, సవాళ్లు, హెచ్చరికలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి హెచ్చరికలను విజ్ఞప్తులతో కలగలిపి మాట్లా డటం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తున్నది. ధాన్యం కొనుగోళ్ల నుంచి మొదలుకుని మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి జలవివాదం వరకు.. హైదరాబాద్ మెట్రో రెండో దశ నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు, మూసీ పునరు జ్జీవన ప్రాజెక్టు నుంచి విభజన హామీల అమలువరకు దాదాపు ప్రతి కీలక అంశంలో కేంద్ర సహకారం,

కేంద్ర జోక్యం, కేంద్ర అనుమతుల కోసం ఎదురుచూస్తూనే మరోవైపు కేంద్రంపై యుద్ధం ప్రకటించినట్లుగా వ్యవ హరించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా మారిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేరుగా కలిసి సమస్యల పరిష్కారం కోసం చర్చించకుండా, బహిరంగ లేఖల ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం కూడా రాజకీయంగా అనేక ప్రశ్నలకు తావిస్తోంది.

కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందనే వాదన ఒకవైపు.. రాష్ట్రానికి అవసరమైన ప్రతి అంశంలో అదే కేంద్రం తలుపు తట్టాల్సి వస్తున్న పరిస్థితి మరోవైపు.. ఈ రెండు విరుద్ధ సంకేతాల మధ్య ప్రజలు అసలు ప్రభుత్వ వైఖరి ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేంద్రంతో ఘర్షణ? సహకారమా? రాజకీయ పోరాటమా? పరిపాలనా అనివార్యతా? అన్న సందిగ్ధతను స్వయంగా ప్రభుత్వమే సృష్టిస్తోందనే విమర్శలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తున్నాయి. 

కొనుగోళ్లకు కేంద్రంపైనే ఆధారం..

తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని చెబుతున్నప్పటికీ, వ్యవస్థ మొత్తాన్ని పరిశీలిస్తే కేంద్ర సహకారం లేకుం డా కొనుగోలు ప్రక్రియ ముందుకు సాగే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చిన తర్వాత దానిని స్వీకరించేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎఫ్‌సీఐనే. సీఎంఆర్ (కస్టమ్ మిల్డ్ రైస్) లక్ష్యాల నిర్ణయం నుంచి బియ్యం సేకరణ వరకు అనేక అంశాలు కేంద్ర విధానాలపైనే ఆధారపడి ఉన్నాయి.

అయితే ప్రజా వేదికలపై కేంద్రం తెలంగాణ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని, ధాన్యం కొనుగోళ్లలో వివక్ష చూపుతోందని ఆరోపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం... అదే సమయంలో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, సన్నబియ్యం పంపిణీ పథకానికి సహకరించాలని, ఎఫ్‌సీఐ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతోంది.

ఇటీవల కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం, తెలంగాణలో పండిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేయడం దీనికి ఉదాహరణగా నిలువడంతోపాటు రాజకీయ విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఒకవైపు కేంద్రం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించడం... మరోవైపు రైతుల ప్రయోజనాల కోసం అదే కేంద్రం జోక్యం, సహకారం కోరడం పరస్పర విరుద్ధ సంకేతాలు పంపుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి.  

తుమ్మిడిహట్టి వివాదంలోనూ ఢిల్లీ వైపే చూపు..

మహారాష్ట్రతో తుమ్మిడిహట్టి జల వివాదం విషయం లో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి కూడా ఇదే తరహా చర్చకు దారితీస్తోంది. ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణంపై సభల్లో, రాజకీయ వేదికలపై తెలంగాణ నాయకత్వం ఘాటైన హెచ్చరికలు చేస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతామని, మహారాష్ట్ర ఏకపక్ష నిర్ణయాలను అడ్డుకుంటామని చెబుతోంది. కానీ వివాదం పరిష్కారం విషయానికి వచ్చేసరికి మాత్రం కేంద్ర జలశక్తి శాఖ జోక్యం చేసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసి తెలంగాణ హక్కులను పరిరక్షించాలని కోరుతోంది.

ఒకవైపు మహారాష్ట్ర ప్రభుత్వంపై రాజకీ యంగా దూకుడు ప్రదర్శిస్తూనే... మరోవైపు సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ వైపే చూడాల్సి వస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కేంద్ర పాత్ర సహజమే అయినప్పటికీ, కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రభుత్వం చివరకు అదే కేంద్రం జోక్యాన్ని ఆశ్రయించడం విరుద్ధ సంకేతాలు పంపుతోందని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నేరుగా కలిసి రాష్ట్ర వాదనను బలంగా వినిపించే ప్రయత్నం చేయకుండా, బహిరంగ లేఖలు రాయడం, కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని కోరడం కూడా చర్చనీయాంశమవుతోంది. రాష్ట్ర ప్ర యోజనాల విషయంలో రాజకీయ భేదాలను పక్కనబెట్టి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. 

అన్నీ కేంద్రం చేతుల్లోనే..

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలిస్తే, వాటిలో చాలా వరకు కేంద్ర ప్రభుత్వ అనుమతులు, నిధులు, సహకారంపైనే ఆధారపడి ఉండటం గమనార్హం. ఒకవైపు కేంద్రం తెలంగాణకు అన్యాయం చేస్తోందని విమర్శలు చేస్తున్న ప్రభుత్వం... మరోవైపు రాష్ట్ర భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక ప్రాజెక్టులన్నింటికీ ఢిల్లీ వైపే చూడాల్సి వస్తోంది. నగర రవాణా వ్యవస్థకు అత్యంత కీలకంగా భావిస్తున్న హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం, ఆర్థిక భాగస్వామ్యం లేకుండా ముందుకు వెళ్లడం కష్టసాధ్యమని ప్రభుత్వం చెబుతోంది.

అందుకే పలుమార్లు కేంద్ర మంత్రులను కలిసి మెట్రో ఫేజ్- ఆమోదం ఇవ్వాలని విజ్ఞప్తులు చేసింది. అదే విధంగా   రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) పరిస్థితి కూడా అంతే. హైదరాబాద్ చుట్టూ అభివృద్ధికి కొత్త దిశ చూపుతుందని చెబుతున్న ఈ ప్రాజెక్టులో ఉత్తరభాగం, దక్షిణ భాగం పనుల విషయంలో కేంద్ర అనుమతులు, నిధులు కీలకంగా మారాయి. కేంద్రం సహకారం లేకుండా ఈ ప్రాజె క్టు పూర్తి కావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు ప్రకటిస్తోంది. కానీ నిధుల సమీకరణ, సాంకేతిక సహకారం, పర్యావరణ అనుమతులు వంటి అంశాల్లో కేంద్ర సహకారం అవసరమవు తోంది. ఈ ప్రాజెక్టుకు జాతీయ స్థాయిలో మద్దతు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే కోరుతోంది. విభజన హామీల అమలు, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, పారిశ్రామిక కారిడార్లు, రక్షణ రంగ పెట్టుబడులు వంటివి కూడా కేంద్ర నిర్ణయాల చుట్టూనే తిరుగుతున్నా యి. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఆరోపించడం.. మరోవైపు రాష్ట్ర అభివృద్ధికి కీలకమై న ప్రాజెక్టులన్నింటికీ కేంద్ర అనుమతులు, నిధులకోసం ఎదురుచూడడం ప్రజల్లో సందేహాలకు తావిస్తోంది. 

కిషన్ రెడ్డిని కలవకుండా బహిరంగ లేఖలు..

తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను నేరుగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లగల స్థాయిలో ఉన్న వ్యక్తిగా ఆయనను రాజ కీయ ప్రత్యర్థులు కూడా గుర్తిస్తుంటారు. అలాంటి కిషన్‌రెడ్డిని నేరుగా కలిసి రాష్ట్ర సమస్యలపై చర్చించడం, సహకారం కోరడం కంటే బహిరంగ లేఖలు రాయడం, మీడియా వేదికగా విజ్ఞప్తులు చేయడం రేవంత్ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

తాజాగా ధాన్యం కొనుగోళ్ల అంశంలో కేంద్రానికి లేఖలు రాస్తూ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్లాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం.. అదే అంశంపై కిషన్ రెడ్డితో నేరుగా సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వాదనను వినిపించే ప్రయత్నం చేయలేదనే విమర్శలున్నాయి. తుమ్మిడిహట్టి వివాదం, మెట్రో ఫేజ్- ఆర్‌ఆర్‌ఆర్, మూసీ, విభజన హామీలు వంటి అంశాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజకీయ విభేదాలను పక్కనబెట్టి అందుబాటులో ఉన్న ప్రతి వేదికను ఉపయోగించుకోవడం ఏ ప్రభుత్వమైనా చేయాల్సిన పని. కానీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న తెలంగాణ నేతలతో సమన్వయం కంటే, రాజకీయంగా వారిని టార్గెట్ చేయడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒకవైపు కేంద్రంపై తీవ్ర విమర్శలు చేస్తూ, మరోవైపు అదే కేంద్రం జోక్యం కోరడం, కిషన్ రెడ్డిని రాజకీయ ప్రత్యర్థిగా చిత్రీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం ఆశించడం విరుద్ధ సంకేతాలుగా కనిపిస్తున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.  రాజకీయంగా కాంగ్రెస్ చేస్తున్న కేంద్ర వివక్ష ప్రచారం బలహీనపడుతుందనే కారణంతోనే ప్రభుత్వం దూరం పాటిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే సమస్యల పరిష్కారం కంటే రాజకీయ సందేశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

గందరగోళంలో ప్రజలు..

తెలంగాణలో బీజేపీని ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా నిలబెట్టాలంటే కేంద్ర ప్రభుత్వంపై దూకుడు తప్పదని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే బహిరంగ సభల్లో తెలంగాణకు అన్యాయం, నిధుల వివక్ష, విభజన హామీల అమలు, రైతుల సమస్యలు, జల వివాదాలు వంటి అంశాలపై కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తోంది. అయితే పరిపాలనకు సంబంధించిన ప్రతి కీలక అంశంలో కేంద్ర సహకారం తప్పనిసరి. రాష్ట్రానికి నిధులు రావాలన్నా, ప్రాజెక్టులు ముందుకు సాగాలన్నా, జాతీయ స్థాయి అనుమతులు లభించాలన్నా చివరకు ఢిల్లీ ద్వారానే వెళ్లాల్సి వస్తోంది.

నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఒకవైపు కేంద్రంపై రాజకీయ యుద్ధం ప్రకటించినట్లు మాట్లాడటం... మరోవైపు అదే కేంద్రం ముందు వరుసగా వినతిపత్రాలు పెట్టడం ప్రజలకు సందేహాలు కలిగిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ముఖ్యంగా కిషన్ రెడ్డిని నేరుగా కలిసి సమస్యలను చర్చించకుండా బహిరంగ లేఖల రాజకీయాన్ని ఎంచుకోవడం, కేంద్రంపై విమర్శలు చేస్తూనే అదే కేంద్రం జోక్యం కోరడం, మహారాష్ట్రతో జల వివాదంలో హెచ్చరికలు చేస్తూనే కేంద్ర మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించడం వంటి పరిణామాలు ఈ చర్చకు మరింత బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక రాజకీయాలను బలపరచాలనే ప్రయత్నం ఒకవైపు, కేంద్రంనుంచి నిధులు తెచ్చుకోవాలనే పాలనా అవసరం మరోవైపు ఉండటంతో ప్రభుత్వం రెండు రకాల సందేశాలు ఇస్తోంది.