అది ఏడేళ్లకే శిథిలం.. ఇది ఇరవై ఏళ్లయినా పదిలం!

14-09-2026 | 05:30am
  1. నాసిరకం పనులతో దెబ్బతిన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్                     
  2. నీరు నింపిన తొలినాళ్లలోనే లీకేజీలు
  3. ప్రస్తుతం విరిగిపోయిన ట్యాంక్ పైపులు
  4. నీరు ఎక్కిస్తామంటే ఆందోళన చెందుతున్న గ్రామస్థులు
  5. ఇరవై ఏండ్లు దాటినా చెక్కుచెదరని పాత ట్యాంక్ 

కోదాడ, సెప్టెంబర్ 13 : కోదాడ మండలంలోని అల్వాలపురంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా విలువైన ప్రజాధనం వృధాగా పోతోందని గ్రామస్థులు చెబుకుంటున్నారు. పది కాలాల పాటు మన్నికగా ఉండాల్సిన మిషన్ భగీరథ (Mission Bhagiratha) వాటర్ ట్యాంకు నాణ్యతా లోపం కారణంగా నిర్మించిన ఏడేళ్లకే శిథిలావస్థకు చేరి కూలిపోయే దశకు చేరిందని గ్రామస్తులే అంటున్నారు.

నిబంధనల ప్రకారం కనీసం 20 ఏళ్లకు పైగా చెక్కు చెదరకుండా ఉండాల్సిన ఈ ట్యాంకు, ప్రజలకు కనీస ప్రయోజనం అందించకుండానే శిథిలమైపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.              

నాసిరకం పనులతో తిప్పలు 

మిషన్ భగీరథ ట్యాంకును 2019లో నిర్మించారు. ఈ ట్యాంక్ నిర్మాణ పనులు నాసిరకంగా చేయడంతో ఇది శిథిలావస్థకు చేరినట్లు స్థానికులు చెప్పుకుంటున్నారు. అయితే ఈ ట్యాంక్ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మూడేళ్ల కిందట నీటిని ఎక్కించినప్పుడే లీకేజీ అయ్యి నీరు మొత్తం పోయినట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం ట్యాంకులోకి నీటి ఎక్కింపు, దింపు పైప్ లైన్లు విరిగిపోయాయి. కాంక్రీట్ మెట్ల పెచ్చులు ఊడిపోయి దారుణ పరిస్థితికి చేరడంతో ట్యాంకు పైకి ఎక్కడానికి కూడా వీల్లేని పరిస్థితి నెలకొంది. 

ఆందోళనలో గ్రామస్థులు 

ఇటీవల అధికారులు ట్యాంకులోకి నీటిని ఎక్కించాలని సూచించగా స్థానిక పాలకవర్గ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ట్యాంకులోకి ఒకవేళ  మరమ్మత్తులు చేసి నీటిని నింపినా అది కూలిపోయే ప్రమాదం ఉందని గ్రామస్తులే  చెబుతున్నారు. 

చెక్కుచెదరనీ పాత వాటర్ ట్యాంక్

 గ్రామంలోని పాఠశాల ఆవరణలో 20 ఏళ్ల కిందట నిర్మించిన పాత వాటర్ ట్యాంకు ఇప్పటికీ చెక్కుచెదరకుండా పటిష్టంగా ఉండడం గమనార్హం. ఇప్పటికీ ఆ ట్యాంకు నుంచే గ్రామానికి తాగునీరు సరఫరా అవుతోంది. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తే పాత ట్యాంకులాగే ఇది కూడా పటిష్టంగా ఉండేదని, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే దీనికి కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీరు నింపడం సాధ్యం కాదు 

గ్రామంలో రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరింది. అధికారులు నీరు ఎక్కించాలని చెబుతు న్నా, ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడేలా లేదు. ట్యాంకు దుస్థితిపై ఇప్పటికే కలెక్టరుకు వివరించాం. మరమ్మత్తులు చేసినా కూడా ఇది వినియోగంలోకి రావడం కష్టమే. అధికారుల తదుపరి సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటాం.              

 పోతురాజు సత్యనారాయణ, సర్పంచ్, అల్వాలపురం

మరిన్ని వార్తలు