21 April, 2026 | 4:14 AM

బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జీవన్‌రెడ్డి

21-04-2026 02:51 AM

రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల నడుమ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం జగిత్యాలలో జరిగిన బీఆర్‌ఎస్ ఆశీర్వాద సభ వేదికగా పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి వెనువెంటనే బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

సభకు హాజరైన వేలాది మంది కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిలో జగిత్యాల జిల్లా పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించారు.స్థానిక నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణ యం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ నియామకంపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహా జగిత్యాల ప్రాంతంలో బిఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

దీని ద్వారా స్థానిక రాజకీయాల్లో పార్టీ మరింత బలపడుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఎన్నికల దృష్ట్యా కూడా ఈ నిర్ణయం వ్యూహాత్మకంగా కీలకమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.మొత్తంగా చూస్తే, జగిత్యాల వేదికగా చేసిన ఈ ప్రకటన బీఆర్‌ఎస్‌లో కొత్త సమీకరణాలకు నాంది పలుకుతుండగా, పార్టీ భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేసిన కీలక పరిణామంగా మారింది.