21 April, 2026 | 4:43 AM

కోతులు పట్టేందుకు భూమి శిస్తు వసూలు!?

21-04-2026 03:20 AM

కోతుల బెడద తీవ్రం రైతులకు కష్టాల మయం

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): పంటల సాగుపై కోతుల బెడద తీవ్ర ప్రభావం చూపుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడద రోజురోజుకూ పెరుగుతూ రైతులకు తలనొప్పిగా మారింది. పంటల సాగు ప్రారంభం నుంచి కోతలు వరకు కోతుల దాడులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు, మొక్కజొన్న, వరి, కూరగాయల పంటలపై కోతుల దాడులు అధికమవుతున్నాయి. దీంతో రైతుల శ్రమ కోతల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటల నాశనం రైతులకు ఆర్థిక నష్టం

కోతులు గుంపులుగా వచ్చి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పండ్ల చెట్లపైకి ఎక్కి పండ్లను తిని, మిగిలిన వాటిని నేలకేసి పడేస్తున్నాయి. మొక్కజొన్న, వరి, పత్తి పంటలను ధ్వంసం చేస్తున్నాయి. కూరగాయల పంటలను కూడా పీకేసి నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు కోతల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారు. కోతుల బెడదను ఎదుర్కొనేందుకు రైతులు పొలాల్లో రోజంతా కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కొంతమంది రైతులు కార్మికులను నియమించుకుని పంటలను కాపాడుతున్నారు. దీని వల్ల సాగు ఖర్చులు మరింత పెరుగుతున్నాయి. లౌడ్స్పీకర్లు, గులేర్లు, ప్లాస్టిక్ కవర్లు, డప్పులు వంటి పద్ధతులు ఉపయోగించినా కోతులు తగ్గడం లేదని రైతులు చెబుతున్నారు. కోతుల బెడద కారణంగా కొన్ని ప్రాంతాల్లో రైతులు పండ్ల తోటలు, కూరగాయల సాగును తగ్గిస్తున్నారు. పంటలు నష్టపోతున్నందున ప్రత్యామ్నాయంగా తక్కువ ప్రమాదం ఉన్న ఆయిల్ పామ్ వంటి పంటలను సాగు చేయడానికి రైతులు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యవసాయ విధానంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

కేవలం పంటలే కాదు, గ్రామాల్లో ఇళ్లలోకి కూడా కోతులు ప్రవేశించి ఆహార పదార్థాలను తీసుకెళ్తున్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల కోతుల దాడులతో గాయపడిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కోతుల బెడదను నివారించేందుకు ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని అనేక పర్యాయాలు విజ్ఞప్తులు చేసినా పెద్దగా పట్టించుకోవడంలేదనే విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. 

కోతుల నివారణకు భూమిశిస్తు వసూలు!

మహబూబాబాద్ జిల్లాలో రోజురోజుకు కోతుల బెడద  తీవ్రంగా మారుతోంది. సాగు చేసిన పంటలను కోతులు ధ్వంసం చేస్తున్నాయి. ఇక కొందరు రైతులు కోతుల నివారణకు కొండెంగలను పెంచడం, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో కోతులను పట్టించి అడవుల్లో వదిలిపెట్టడం ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో కోతులను పట్టించడం ఖర్చుతో కూడుకోవటంతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట గ్రామ రైతులు ఎకరానికి 500 రూపాయల చొప్పున భూమిశిస్తూ రూపంలో వసూలు చేసి ఆ డబ్బుతో కోతులను పట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ అంశం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.