రాహుల్‌గాంధీ పుట్టినరోజున జాబ్ మేళా
- 19న అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలి
- రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్
హైదరాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 19వ తేదీన గాంధీ భవన్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని రాజ్యసభ ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. జాబ్ మేళాకు 100 కంపెనీలు వస్తున్నాయని, నిరుద్యోగ యువత జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లక్ష మందికి వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలు కల్పించిందన్నారు.
కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని, దీనిపై రాహుల్‌గాంధీ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని అన్నారు. మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఉన్నవి కాస్తా పీకేస్తున్నారని విమర్శించారు. ఇందిరా గాంధీ, నెహ్రు, రాజీవ్ గాంధీ, పీవీ నర్సింహ రావు చేసిన అభివృద్ధికి పేరు మార్చి మోదీ భజన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేటిఆర్ కుటుంబంలో అందరూ వెన్నుపోటు దారులేనని, ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నారో ప్రజలకు బాగా తెలుసని అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు.






