10 August, 2026 | 11:27 AM

స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి

10-08-2026 09:07 AM

సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 

చౌటుప్పల్, ఆగస్ట్ 9(విజయక్రాంతి): చౌటుప్పల్ పరిధిలోని పరిశ్రమలలో స్థానిక నిరుద్యోగ యువతకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ప్రజా చైతన్య యాత్ర’ ఆదివారం చౌటుప్పల్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక పరిశ్రమల వల్ల వందలాది ఎకరాల వ్యవసాయ భూములు, పంటలు, భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాలుగా నష్టపోతున్న స్థానిక యువతకు ఉపాధి కల్పించడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మండిపడ్డారు.

​కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలు నడుపుతున్నారని, ప్రమాదాలు జరిగినప్పుడు సమాచారం బయటకు రాకుండా చూస్తూ కార్మిక కుటుంబాలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన పిసిబి  అధికారులు నామమాత్రపు తనిఖీలతో యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి యువతకు ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకోకపోతే, గ్రామీణ యువతను సమీకరించి పరిశ్రమల ఎదుట ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెరిగిన నిత్యావసర ధరలను అదుపులోకి తెచ్చి పేదలను ఆదుకోవాలని, ఎన్నికల హామీలను నెరవేర్చాలని కోరారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పల్లె శేఖర్ రెడ్డి, బచ్చనగోని గాలయ్య, టీఎస్‌పీఎన్ఎమ్ రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్దె శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు దుబ్బాక భాస్కర్, కలకొండ సంజీవ, చిలివేరు అంజయ్య, సుర్వి నర్సింహా తదితరులు పాల్గొన్నారు.