10 August, 2026 | 11:48 AM

సాగుదారులపై దాడులు దౌర్జన్యాలను ప్రతిఘటించాలి

10-08-2026 10:47 AM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుంట్రలను అడ్డుకుంటాం.

 ఇల్లందు, గుండాల ప్రాంతాల్లో నూతన భూగర్భగనులు ఏర్పాటు చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా

 ఏజెన్సీ మండలాల్లో ఉత్సాహంగా నాలుగో రోజు ప్రజాచైతన్య యాత్రలు

లక్ష్మీదేవిపల్లి/ఆళ్లపల్లి/గుండాల/ఇల్లందు, (విజయక్రాంతి): ఏజెన్సీ గ్రామాలతో మిళితమైవున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజన, గిరిజనేతర పోడు సాగుదారులకు వారు సాగు చేసుకుంటున్న భూములపై తక్షణమే హక్కులు కల్పించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర  లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లిలో ప్రారంభమైంది. అక్కడ నుండి సంపత్ నగర్, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లందు మండలం, ఇల్లందు పట్టణాల మీదుగా యాత్ర ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. దశాబ్దాలుగా భూములను నమ్ముకుని జీవిస్తున్న పోడు సాగుదారులపై అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖలు కక్షపూరితంగా దాడులకు, దౌర్జన్యాలకు పాల్పడటం దారుణమన్నారు. సాగుభూములను లాక్కోవడం అటవీ హక్కుల చట్టాన్ని తీవ్రంగా నీరుగార్చడమేనని మండిపడ్డారు.

గ్రామీణ పేదలకు ఏకైక ఆధారంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని దశలవారీగా నిర్వీర్యం చేసేందుకు కుట్రలు సాగుతున్నాయని విమర్శించారు. ఏండ్లు గడుస్తున్నా మారుమూల గ్రామీణ ప్రాంతాలు కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని, సరైన రోడ్డు మార్గాలు లేక ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రశ్నించే గొంతులను నొక్కేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు తెగనమ్ముతూ, దేశ సంపదను బడాబాబులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. సెప్టెంబర్ 1న చేపట్టే 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, కల్లూరి వెంకటేశ్వరరావు, సరెడ్డి పుల్లారెడ్డి, నరాటి  ప్రసాద్, చంద్రగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.