పాము కాటుతో వ్యవసాయ కూలీ మృతి
లక్ష్మీదేవిపల్లి, (విజయక్రాంతి): పాము కాటుకు గురై వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన లక్ష్మీదేవిపల్లి మండలం హర్యాతండా గ్రామపంచాయతీ పరిధిలోని హరియా తండాలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన భూక్యా బాలు (60), వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆగస్టు 8వ తేదీ రాత్రి బాలు ఇంట్లో నిద్రకు ఉపక్రమించాడు. ఆగస్టు 9వ తేదీ తెల్లవారుజామున నిద్రలోనే మృతి చెంది ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. మృతుడి కుడికాలి బొటనవేలిపై పాముకాటు ముద్రలు కనిపించడంతో పాము కాటుతో మృతి చెంది ఉండవచ్చని అనుమానించారు.
వెంటనే ఈ విషయాన్ని లక్ష్మీదేవిపల్లి పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా వివరాలను నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది. బాలు మృతితో హరియా తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.






