ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులది కీలక పాత్ర
ఎంపీ ఈటెల రాజేందర్
మేడ్చల్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారంలో జర్నలిస్టులది కీలకపాత్ర అని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ ఎదుట అద్దె భవనంలో ఏర్పాటుచేసిన మేడ్చల్ జిల్లా ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ వార్తలు రాస్తూ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారన్నారు.
జర్నలిస్టు సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. వార్త సేకరణకు కావలసిన సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిపై ఉందన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని, లేదా కనీసం స్థలాన్ని లీజుకి ఇవ్వాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం స్థలం కేటాయిస్తే భవనానికి తమ వంతు సహాయం చేస్తామన్నారు. ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టులు ప్రజా సమస్యల పరిష్కారంలో తమ వంతు పాత్ర పోషించాలన్నారు. జిల్లా ప్రెస్ క్లబ్ కు ప్రభుత్వం స్థలం కేటాయించడానికి తన వంతు కృషి చేస్తానని ఆర్టిఏ సభ్యుడు భీమిడి జైపాల్ రెడ్డి అన్నారు.
గెజిటెడ్ ఆఫీసర్స్ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ కుమార్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రవి కిరణ్, జర్నలిస్టు సంఘాల నాయకులు మోతే వెంకట్ రెడ్డి, కోలా వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు విక్రం రెడ్డి, డి పి ఆర్ ఓ స్వర్ణలత, ఐ అండ్ పి ఆర్ డిప్యూటీ ఇంజనీర్ నాగాంజలి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కే రవిచంద్ర, పాకాల రవీందర్, అక్రిడిటేషన్ కమిటీ సభ్యుడు వి రామారావు, రవి కిరణ్ రెడ్డి, దేశం కృష్ణ, బాల్ రెడ్డి, పండగ రామకృష్ణ, రచ్చ శ్రీనివాస్, తోకల మల్కయ్య తదితరులు పాల్గొన్నారు.






