31-08-2025 06:39:32 PM
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు కృషి చేయాలి అని ప్రముఖ సామాజిక వేత్త, రోడ్డు భద్రత సలహాదారు, ప్రముఖ పత్రికల ఎడిటోరియల్ వ్యాసకర్త డాక్టర్ నీలం సంపత్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవన్ లో సమాజంలో మీడియా పాత్ర అనే అంశంపై జర్నలిస్ట్ లకు అవగాహనా కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సమస్యలను వెతికి, ఆలోచించి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మీడియా ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని వివరించారు. జర్నలిస్ట్ లు భయం లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా వార్తలు రాయాలని సూచించారు.
వృత్తి ధర్మాన్ని నిర్వహించే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. పాలకులను, ప్రతిపక్షాలను ప్రజల మేలు కోసమే పని చేసేలా జర్నలిస్ట్ ల వార్తలు ఉండాలన్నారు. బెదిరింపులకు భయపడకుండా ప్రజల కోసం మీడియా నిలబడాలన్నారు. ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా త్యాగం చేస్తేనే నేడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామని పలు ఉదాహరణలతో వివరించారు. మీడియా అనేది సామాజిక బాధ్యతలో భాగమని, సమాజాభివృద్ధి కోసం మీడియాకు భారత రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ ప్రత్యేక స్థానాన్ని కల్పించారని గుర్తు చేశారు. అంతకుముందు డాక్టర్ నీలం సంపత్ ను జర్నలిస్ట్ లు శాలువాతో ఘనంగా సన్మానించారు.