జుక్కల్ సొసైటీ చైర్మన్‌పై అవినీతి ఆరోపణలు
జొన్నల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయంటూ రైతుల అనుమానాలు
జుక్కల్,సెప్టెంబర్ 15(విజయ క్రాంతి): జుక్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(PACS)లో యాసంగి సీజన్లో జరిగిన జొన్నల కొనుగోళ్లపై పలు ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొసైటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా జొన్నలు కొనుగోలు చేశారంటూ కొందరు రైతులు ఆరోపిస్తున్నారు.యాసంగి సీజన్లో సొసైటీ పరిధిలో సుమారు 14 లారీల జొన్నలను ప్రైవేట్‌గా కొనుగోలు చేసినట్లు,ఆ లావాదేవీలకు సంబంధించి కొందరు రైతుల పేర్లను ఉపయోగించి వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో రైతుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.రైతుల నుంచి నిజంగానే జొన్నలు కొనుగోలు చేశారా?లేక ప్రైవేట్‌గా కొనుగోలు చేసిన జొన్నలను రైతుల పేర్లతో సొసైటీ లావాదేవీల్లో చూపించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడం, ఆ తర్వాత జరిగిన లావాదేవీలపై స్పష్టత రావాల్సి ఉంది. సుమారు 14 లారీల జొన్నలకు సంబంధించిన కొనుగోళ్లు, రవాణా, తూకాలు, బిల్లులు, రైతుల బ్యాంకు ఖాతాల్లో జరిగిన నగదు జమలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తే అసలు విషయం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై సహకార శాఖ, మార్కెటింగ్ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
కొనుగోలు రికార్డులు, రైతుల వివరాలు, తూకం పట్టీలు, బిల్లులు, లారీల రవాణా వివరాలు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, ఆరోపణల్లో నిజం లేకపోతే పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించి అనుమానాలను నివృత్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. జుక్కల్ పీఏసీఎస్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు అధికారులు వెంటనే విచారణ చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.