10-02-2026 01:21:35 AM
హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 09 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్‌ఎంసీ నేటితో ముగిసింది. నగర ప్రథమ పౌరురాలు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నేతత్వంలోని ప్రస్తుత పాలకమండలి పదవీకాలం నేడు అధికారికంగా పూర్తికానుంది. 2020 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో విజ యం సాధించి, 2021 ఫిబ్రవరి 11న ప్రమా ణ స్వీకారం చేసిన 150 మంది కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు బుధ వారం నుంచి మాజీ ప్రజాప్రతినిధులుగా మారనున్నారు.
పదవీకాలం ముగియడంతో కార్పొరే టర్లకు ఇప్పటివరకు ప్రభు త్వం సమకూర్చిన అధికారిక వాహనాలు, గన్‌మెన్లు, కార్యాలయ సిబ్బంది, ఇతర అధికార లాంఛనా లను అధికారులు తక్షణం ఉపసంహరించుకోనున్నారు. తదుపరి ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకమండలి కొలువుదీరే వరకు నగరంలోని అన్ని డివిజన్ల పరిపాలనా బాధ్యతలను ప్రభుత్వం నియమించే ప్రత్యేక అధికారులు ర్యవేక్షించనున్నారు.
వార్డుల పెంపు.. సిట్టింగ్స్‌లో వణుకు..
పాలకమండలి గడువు మంగళవారం ముగుస్తుండడంతో సిట్టింగ్ కార్పొరేటర్లలో తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందో ళన మొదలైంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ వార్డు ల సంఖ్యను 150 నుంచి ఏకంగా 300కు పెంచుతూ ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయడమే. డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా తమ పాత వార్డులోని కీలక ఓటు బ్యాంకు ఉన్న బస్తీలు, కాలనీలు ఏ కొత్త వార్డు పరిధిలోకి వెళ్తాయోనని నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తగా ఏర్పడే సరిహద్దులు, త్వరలో ఖరారు కానున్న సామాజిక రిజర్వేషన్లే ఈ మాజీ కార్పొరేటర్ల భవిష్యత్తును నిర్ణయించనున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వివాదాలు, విమర్శల నడుమ ముగిసిన మేయర్ ప్రస్థానం
2020లో కరోనా సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల్లో జరిగిన ఎన్నికల్లో నాటి అధికార బీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించింది. బంజారాహిల్స్ డివిజన్ నుంచి గెలిచిన గద్వాల్ విజయలక్ష్మి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఏ పాలకమండలికి దక్క ని విధంగా పూర్తి పదవీకాలం కొనసాగిన రికార్డు ఈ కౌన్సిల్‌కు దక్కినా, పరిపాలనలో మాత్రం మేయర్ తనదైన ప్రత్యేకముద్ర వేయలేకపోయారన్న విమర్శలు బలంగా ఉన్నాయి.
పౌరసేవల నిర్వహణలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ, ఆమె హయాం ఎక్కువగా వివాదాలతోనే సాగింది. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఆమె సొంత పార్టీ అప్పటి బీఆర్‌ఎస్ కార్పొరేటర్లతో సఖ్యత లేకపోవడం చర్చనీయాంశ మైంది. కనీసం తన పార్టీ కార్పొరేటర్లను కూడా కలుపుకుపోలేదని సహచరులే బహిరంగ విమర్శలు చేశారు. ముఖ్యంగా డిప్యూ టీ మేయర్ శ్రీలతను పక్కనబెట్టడం, ఇద్దరి మధ్య ఐదేళ్ల పాటు ప్రచ్ఛన్న యుద్ధం నడవడం బల్దియా వర్గాల్లో కోడై కూసింది.
తొలి స్టాండింగ్ కమిటీ సభ్యులతోనూ మేయర్ సమన్వయం చేసుకోలేకపోయారు. 2022 లో బాగ్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటనపై మేయర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాగ్రహానికి కారణమయ్యాయి. అలాగే భవన నిర్మాణదారులను మేయర్ అనుచరవర్గం వేధించింద న్న ఆరోపణలు కూడా ఆమె ఇమేజ్‌ను దెబ్బతీశాయి. కౌన్సిల్ సమావేశాల నిర్వహణలో నూ తొలుత తడబడ్డా, ఆ తర్వాత పుంజుకున్నప్పటికీ.. సభ్యుల ప్రశ్నలను దాటవేస్తూ అధికారులను వెనకేసుకొస్తున్నారన్న అపవాదును ఆమె మూటగట్టుకున్నారు.
నిధుల లేమితోనే నిష్ర్కమణ
2016 నుంచి కార్పొరేటర్లుగా కొనసాగుతున్న వారికి సరైన వార్షిక బడ్జెట్ లేకపోవ డం గమనార్హం. తమ డివిజన్ల అభివద్ధికి ఏటా రూ.3 కోట్ల బడ్జెట్ కేటాయించాలని పలుమార్లు కౌన్సిల్ సమావేశాల్లో సభ్యులు డిమాండ్ చేసినా, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. తీవ్ర ఒత్తిడి తర్వాత, గత ఏడాది నవంబర్ 25న జరిగిన సర్వసభ్య సమావేశంలో ఒక్కో కార్పొరేటర్‌కు రూ.2 కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను కౌన్సిల్ ప్రకటించింది.
అయితే ఇందులోనూ మెలిక పెట్టారు. రూ.కోటి ప్రతిపాదనలను నేరుగా సమర్పించుకునే వెసులుబాటు ఇచ్చినా, మిగిలిన రూ. కోటి మంజూరుకు జిల్లా ఇన్‌చార్జి మం త్రి పొన్నం ప్రభాకర్ అనుమతి తీసుకోవాలన్న నిబంధన విధించారు. మంత్రి అందు బాటులో లేకపోవడంతో, ప్రస్తుతమున్న 144 మంది కార్పొరేటర్లలో సగం మంది కేవలం రూ.కోటి పనులకు మాత్రమే ప్రతిపాదనలు ఇవ్వగలిగారు.
మిగిలిన నిధులు వాడుకోలేక అసంతృప్తితోనే నేడు పదవి నుంచి వైదొలుగుతు న్నారు. మొత్తానికి ఐదేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు, రాజకీయ మార్పులు, వివాదాల నడుమ నేటితో ఈ పాలకమండలి కథ కంచికి చేరుతుంది.
చివరి నిమిషంలో హడావిడి నిర్ణయాలు
పాలకమండలి గడువు సమీపిస్తున్న తరుణంలో, ముఖ్యంగా చివరి మూడు నెలల్లో పాలకవర్గ పెద్దలు అప్రమత్తమయ్యారు. పదవి ఉండగానే పనులు చక్కబెట్టుకునేందుకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. చివరి రోజుల్లోనైనా తమకు సహకరించాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే జరిగిన పలు స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో కార్పొరేటర్ల స్టడీ టూర్లు, లీజుల పొడిగింపు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలను టేబుల్ ఐటమ్స్ పెట్టి ఆమోదింపజేసుకున్నారు. జోనల్ కమిషనర్లకు అదనపు అధికారాలు కట్టబెట్టేలా కమిషనర్‌పై ఒత్తిడి తేవడం, ప్రతి చిన్న పనికి సంబంధించిన టెండర్ స్టాండింగ్ కమిటీ దష్టికి రావాల్సిందేనని పట్టుబట్టడం వంటి పరిణామాలు చివరి దశలో చోటుచేసుకున్నాయి.