8 August, 2026 | 10:38 PM

మృతదేహంతో ఐటీసీ గేటు ముట్టడి!

08-08-2026 09:30 PM

శ్రీరామ్ కుటుంబం రణభేరి.. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని తేల్చిచెప్పిన కుటుంబ సభ్యులు

‘‘గతంలో మృతుల కుటుంబాలకు న్యాయం చేశారు.. మాకెందుకు చేయరు?’’

బూర్గంపాడు,(విజయక్రాంతి): ఐటీసీ పీఎస్పీడీ కర్మాగారం గేటు వద్ద గుగులోత్ శ్రీరామ్ కుటుంబ సభ్యులు మృతదేహంతో చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఐటీసీలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ప్రధాన రహదారిపైకి వస్తున్న సమయంలో లారీ ఢీకొనడంతో శ్రీరామ్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం కుటుంబ సభ్యులు, బంధువులు ఐటీసీ గేటు ముందు ఆందోళనకు దిగారు.

మృతదేహంతో నిరసన

కర్మాగారంలో విధులు ముగించుకుని బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఐటీసీ సమీపంలోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో యాజమాన్యం బాధ్యత తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్రిమెంట్‌ ప్రకారం రావాల్సిన పరిహారం, కుటుంబానికి కల్పించాల్సిన భరోసాపై స్పష్టత ఇవ్వాలని కోరారు.శ్రీరామ్ మృతదేహాన్ని ఐటీసీ గేటు వద్ద ఉంచి కుటుంబ సభ్యులు ధర్నా చేపట్టారు. తమ కుటుంబాన్ని ఆదుకునే విషయంలో యాజమాన్యం తక్షణమే స్పందించాలని డిమాండ్‌ చేశారు.

‘‘న్యాయం జరిగే వరకు కదిలేది లేదు’’

‘‘గతంలో ప్రమాదాల్లో మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేశారు. మాకు ఎందుకు చేయరు?’’ అంటూ కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని, న్యాయం జరిగేంత వరకు ఐటీసీ గేటు నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

సర్పంచ్ సంఘీభావం

శ్రీరామ్ కుటుంబ సభ్యుల ధర్నాకు సారపాక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ సంఘీభావం తెలిపారు. ఐటీసీ గేటు వద్ద ఉంచిన శ్రీరామ్ మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. శ్రీరామ్ కుటుంబానికి తగిన పరిహారం అందించి భరోసా కల్పించాలని కోరారు.

గేటు వద్ద ఉద్రిక్తత

శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులు న్యాయం జరిగే వరకు ధర్నా విరమించేది లేదని తేల్చిచెప్పడంతో ఐటీసీ గేటు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.