8 August, 2026 | 11:25 PM

హైడ్రా ఉద్యోగాలకు నిరుద్యోగుల తాకిడి

08-08-2026 10:05 PM

- సరూర్ నగర్ స్టేడియంలో ఉద్రిక్తత

ఎల్బీనగర్: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం ప్రాంగణం శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తతకు వేదికైంది. హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)లో ఉద్యోగాల భర్తీ కోసం ఏర్పాటు చేసిన రిక్రూట్‌మెంట్‌కు నిరుద్యోగ యువత భారీ సంఖ్యలో తరలిరావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.​ సరూర్‌నగర్ స్టేడియంలో ఆగస్టు 8, 9 తేదీల్లో ఉదయం 5 గంటలకు ఈవెంట్స్ ఉంటాయని హైడ్రా ప్రకటన విడుదల చేసింది.‌

హైడ్రా విభాగంలో 50 డ్రైవర్, 100 డీఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని కోసం అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. 170 సెకన్లలో 800 మీటర్ల రన్నింగ్, 15 సెకన్లలో 100 మీటర్లు, లాంగ్ జంప్ 4 మీటర్లు, 6 మీటర్ల షాట్‌పుట్ (7.2కిలోలు) ఈవెంట్లలో క్వాలిఫై అవ్వాలని  హైడ్రా అధికారులు ప్రకటించారు. ఆయా పోస్టుల భర్తీ ప్రక్రియ సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం ప్రారంభమైంది. ఉద్యోగ సాధనకు భారీసంఖ్యలో నిరుద్యోగులు తరలివచ్చారు.

- ​కిక్కిరిసిన సరూర్ నగర్ స్టేడియం పరిసరాలు

​ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో నిరుద్యోగ యువకులు శనివారం తెల్లవారుజాము నుంచే సరూర్ నగర్ స్టేడియం వద్దకు చేరుకుని క్యూ లైన్లలో నిల్చున్నారు. సమయం గడిచేకొద్దీ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి యువత తాకిడి విపరీతంగా పెరిగింది. చూస్తుండగానే సుమారు 2,000 నుంచి 3,000 మందికి పైగా యువకులు తరలిరావడంతో స్టేడియం పరిసర ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి.​ దీంతో అధికారులు అభ్యర్థులను నియంత్రించేందుకు టోకెన్లు పంపిణీ చేపట్టారు.

టోకెన్లు పంపిణీ చేసే క్రమంలో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. ముందుకెళ్లేందుకు అభ్యర్థులు ఒకరినొకరు నెట్టుకోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ తోపులాటలో పలువురు యువకులు ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. అదృష్టవశాత్తూ ప్రమాదం తప్పినప్పటికీ, కొంతమందికి స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్టేడియానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి యువతను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. నిరుద్యోగుల సంఖ్యను అంచనా వేయడంలో నిర్వాహకుల అంచనాలు తప్పడమే ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణమని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.