మంబాపూర్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన గ్రామస్తులు
గుమ్మడిదల, జూన్ 9 :గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 8 లో ఉన్న 72.18 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించి, తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అప్పగించాలని కోరుతూ మంబాపూర్ గ్రామ లబ్ధిదారులు, యువకులు, గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివెళ్లి గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ చిన్న పాపని కుమార్ గౌడ్ నేతృత్వంలో గ్రామస్తులు ఆధ్వర్యంలో తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు.
గత ప్రభుత్వం మంబాపూర్ పరిధిలోని సర్వే నంబర్ 8 లో గల 72.18 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం 62 మంది పేద లబ్ధిదారులకు కేటాయించింది. అయితే ఇప్పటివరకు ఈ భూమికి సంబంధించి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించకపోవడం వల్ల హద్దులు నిర్ధారణ కాలేదు. దీనివల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కబ్జాదారుల కన్ను.. ఆందోళనలో లబ్ధిదారులు..
ఇదే అదనుగా భావించి కొంతమంది అక్రమార్కులు, కబ్జాదారులు ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పేదలకు కేటాయించిన భూమిని కబ్జాదారుల బారి నుంచి కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. గ్రామస్తులు, యువకుల డిమాండ్ సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, సర్వే నంబర్ 8 లోని 72.18 ఎకరాల భూమికి పూర్తిస్థాయి సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు.
హద్దులు నిర్ధారించి, గత ప్రభుత్వం కేటాయించిన విధంగా 62 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను త్వరితగతిన అప్పగించి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంబాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ తలారి దయానంద్, మాజీ వార్డ్ సభ్యులు యాట దయానంద్, యాట నాగరాజ్, మద్దూరి లక్ష్మణ్, గొట్టి ముక్కుల రాజు, రొయ్యపల్లి శ్రీకాంత్, కొండని ఎల్లయ్య, కాంజర్ల వెంకటస్వామి, నిరుడు శ్రీనివాస్, కొత్తపేట గోపాల్, పట్టా లబ్ధిదారులు పాల్గొన్నారు.






