5 June, 2026 | 2:18 AM

పోలవరం బ్యాక్‌వాటర్ బాధితులకు న్యాయం చేయాలి

05-06-2026 01:04 AM

ప్రభావిత గ్రామాల రక్షణకు కేంద్రం తక్షణ చర్యలు చేపట్టాలి

పీపీఏ బృందానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి 

బూర్గంపాడు, జూన్ 4, (విజయక్రాంతి): పోలవరం బ్యాక్ వాటర్ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని, ప్రభావిత గ్రామాల రక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

ఈ మేరకు గురువారం పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం)ను కలిసి చర్చించారు. అనంతరం పాయం పీపీఏ సీఈఓ సంజీవ్ నందన్ సహార్ ను కలిసి పోలవరం బ్యాక్ వాటర్ వల్ల పినపాక నియోజకవర్గంలో అశ్వాపురం, బూర్గంపాడు ప్రాంతాల్లో ముంపు పరిస్థితులను వివరించి వారికి న్యాయం చేయాలని కోరారు.

గ్రామాల్లో వ్యవసాయ భూములు, ప్రజల జీవనోపాధి, మౌలిక సదుపాయాలకు ఏర్పడుతున్న ముప్పుపై తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. బూర్గంపాడు, అశ్వాపురం మండలాలతో పాటు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం తదితర గ్రామాలు పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంతో తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయని అధికారిక అంచనాల కంటే వాస్తవ పరిస్థితుల్లో మరింత విస్తీర్ణంలో వ్యవసాయ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వందల కుటుంబాలు నిర్వాసితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అశ్వాపురం హెవీ వాటర్ ప్లాంట్ భద్రతకు కూడా భవిష్యత్లో వరదముప్పు వాటిల్లే అవకాశం ఉందని పీపీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభావిత ప్రాంతాల్లో సమగ్ర శాస్త్రీయ బ్యాక్ వాటర్ సర్వే నిర్వహించి పునరావాస, పునఃనిర్మాణ ప్యాకేజీ ప్రకటన చేయడం, భూములు కోల్పోయే రైతులకు న్యాయపరమైన పరిహారం, ఉపనదులపై బ్యాక్ వాటర్ ప్రభావ అధ్యయనం చేపట్టడం, శాశ్వత వరద నియంత్రణ చర్యలు అమలుచేయడం, రక్షణ కరకట్టలు, ప్లడ్ ప్రొటెక్షన్ వాల్స్ నిర్మించడం వంటి డిమాండ్లతో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి,మారం వెంకటేశ్వర్ రెడ్డి,యారం పిచ్చిరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.