11 May, 2026 | 5:17 AM

కాళోజీ జీవితం స్ఫూర్తివంతం

09-09-2024 03:35 AM
  1. ఆయన ఆలోచనలు ఆదర్శం 
  2. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్8 (విజయక్రాంతి): ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జీవితం అందరికీ స్ఫూర్తివంతమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కాళోజీ జయంతి (సెప్టెంబర్ 9) సందర్భంగా వారి సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. ప్రజాపక్షం నిలిచి ధిక్కార జీవితాన్ని గడిపిన మానవతావాది కాళోజీ అని కేసీఆర్ కొనియాడారు. పుట్టుక, చావుల మధ్య బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ అని కీర్తించారు. తెలంగాణ సాధన కోసం తాను బయలుదేరిననాడు నిండు మనసుతో దీవించారని గుర్తుచేసుకున్నారు.

నూతన తెలంగాణ రాష్ట్రంలో కాళోజీ స్ఫూర్తి  కొనసాగే దిశగా వారి జన్మదినాన్ని తెలంగాణ భాషా దినోత్సవంగా నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటించిందన్నారు. తెలంగాణ భాష, సాహిత్యాలలో విశేషంగా కృషిచేసిన వారికి కాళోజీ పురస్కారాన్ని ఏర్పాటు చేసుకొని సాహితీవేత్తలను గౌరవించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర వైద్య విశ్వవిద్యాల యానికి కాళోజీ పేరు పెట్టుకున్నామని, వరంగల్‌లో కాళోజీ కళాకేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు.