కన్నెపెళ్లి పంప్ హౌస్ మోటార్లను వెంటనే ఆన్ చేయాలి
బిఆర్ఎస్ మండల కన్వీనర్ మైలారం నారాయణ
సుల్తానాబాద్,(విజయక్రాంతి): కన్నెపెళ్లి లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌస్ నుండి వెంటనే మోటార్లను ఆన్ చేసి రైతుల పొలాలకు నీరు వదలాలని భారత రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్)పార్టీ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కన్వీనర్ మైలారం నారాయణ ఆదివారం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతున్నా రైతులను మాత్రం అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందని, ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్షతో ఈనాడు గోదావరిలో లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం ఉన్నా కూడా మోటార్లు ఆన్ చేసి లిఫ్టుల ద్వారా నీళ్లను కాపాడవలసిన ప్రభుత్వం, బిఆర్ఎస్ కు పేరు వస్తుందనే కుంచిత మనస్తత్వంతో మోటార్లు ఆపివేసిందని అన్నారు.
వరి సాగును తగ్గించాలనే ఉద్దేశంతోటి రైతులను హరిగోశ పెడుతున్నారని, మోటార్లను ఆన్ చేయాలని మేధావులు, ఇంజనీర్లు ఎంత చెప్పినా నారుమడులు ఎండిపోతున్న రైతులను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు అని, రైతులు ఆకాశం వైపు ఆవేదనగా ఎదురు చూస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వెంటనే స్పందించి మోటార్లను ఆన్ చేసి ప్రాజెక్టులో నీరు నింపే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి రైతులను ఆదుకోవాలి అని అన్నారు. ఇప్పుడు వరి నాట్లు వేసే సమయం. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రైతులు కన్నీరు పెడుతున్నారు. రైతుల కోసం బిఆర్ఎస్ పార్టీ చివరి వరకు పోరాడుతుందిఅని. ప్రభుత్వం స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం అని మైలారం నారాయణ స్పష్టం చేశారు,






