కర్ణంగూడను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి
కలెక్టర్ నారాయణ రెడ్డి
ఇబ్రహీంపట్నం, జూన్ 4(విజయక్రాంతి):కర్ణంగూడ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో నిర్వహించిన ‘ప్రజాపాలనప్రగతి ప్రణాళిక’ గ్రామసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు.
ఎరువుల పంపిణీ మొబైల్ యాప్ ద్వారానే జరుగుతుందని, కాబట్టి రైతులందరూ తప్పనిసరిగా ’ఫార్మర్ రిజిస్ట్రేషన్’ పూర్తి చేసుకోవాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ పారిశుద్ధ్యాన్ని పాటించాలని, ప్రతి కుటుంబం ఒక మొక్కను నాటాలని కోరారు. గ్రామంలో మూతపడిన ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభించేందుకు గ్రామస్థులు సహకరించాలని, విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
అర్హులైన వారంతా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం డీసీపీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుమల రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ మోహన్, ఇతర అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.






