ఇండియా మ్యాప్‌లో కశ్మీర్ మాయం
- సీడబ్ల్యూసీ సమావేశాల్లో బ్యానర్ల ప్రదర్శన
- జమ్మూకశ్మీర్‌ను పాక్‌కు అప్పగించడమే కాంగ్రెస్ అజెండా
- ఆ పార్టీకి పాకిస్తాన్ అంటేనే ఇష్టమంటూ బీజేపీ ఫైర్
బెంగళూరు, డిసెంబర్ 27: తాజాగా భారతదేశ మ్యాప్‌ను వక్రీకరించి కాంగ్రెస్ పార్టీ వివాదంలో ఇరుక్కున్నది. జమ్మూకశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌ను పోస్టర్లపై వేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కర్ణాటక బెల్గాంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే మహాత్మాగాంధీ ఏఐసీసీ సమావేశానికి అధ్యక్షత వహించి శతాబ్ది పూర్తవడంతో ఈ సమావేశాలను కాంగ్రెస్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది.
ఈ క్రమంలో ఆ పార్టీ గురువారం ప్రదర్శించిన బ్యానర్లలో జమ్మూకశ్మీర్ పూర్తిగా లేని భారతదేశ మ్యాపుని ఉంచడం వివాదంగా మారింది. దీనిపై బీజేపీ కర్ణాటక రాష్ట్ర విభా గం ఎక్స్ వేదికగా విమర్శలు చేసింది. కశ్మీర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చిత్రీకరించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాంగ్రెస్ పూర్తిగా అగౌరవపరుస్తోందని బీజే పీ విమర్శించింది.ఇదంతా తమ ఓటు బ్యాం కును సంతోషపెట్టడానికి చేసిందని పోస్ట్ చేసింది.
ఈ వివాదంపై బీజేపీ సీనియర్ నేత హెహజాద్ పూనావాలా స్పందిస్తూ.. ఇది “భారత్ టోడో, తుక్డే ఆలోచనల్ని నొక్కి చెబుతోందని అన్నారు. కశ్మీర్ పాకిస్తాన్‌లో భాగం కావాలనుకునే రాహుల్‌గాంధీ ఇల్హాన్ ఒమర్‌తో సమావేశమవుతారని.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు ఇవ్వాలనే సంస్థకు సోనియాగాంధీ సహ అధ్యక్షురాలు అని విమర్శించారు.
పాక్ పాటలు పాడటం, పాకిస్తాన్‌కు జమ్మూకశ్మీర్‌ను అప్పగించడం కాంగ్రెస్ ఎజెండా అని పూనావాలా దుయ్యబట్టారు. మరో బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందిస్తూ.. ఇది భారతీయ ముస్లింలు పాకిస్థాన్‌కు మరింత విధేయంగా ఉన్నారనడాన్ని సూచిస్తుందని.. కాంగ్రెస్ కొత్త ముస్లిం లీగ్ అని విమర్శించారు.






