కౌలాస్ కోట.. కాకతీయుల కాలం నాటిదే
* తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాల్లో ఒకటిగా ప్రసిద్ధి
* మతాలకు అతీతంగా ఆలయాలు, మసీదుల నిర్మాణం
* ప్రత్యేక ఆకర్షణగా సహజసిద్ధ నీటి ఊట
* కనువిందు చేస్తున్న తామరపూల చెరువు
* అబ్బురపరుస్తున్న హిందూ దేవతా శిల్పాలు
* 18 మీటర్ల ఎత్తు, 552 ఎకరాల్లో చెక్కు చెదరని ఆనవాళ్లు
* ఇటీవల సందర్శించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
* టూరిజం ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు హామీ
కామారెడ్డి, డిసెంబర్ 28 (విజయక్రాంతి):తెలుగు రాష్ట్రాల్లోని చారిత్రక కట్టడాల్లో కౌలాస్ కోట ఒకటి. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్ నియోజకవర్గం హైదారాబాద్ నుంచి 180 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి నాందేడ్ రహదారిపై ఈ కోట ఉన్నది. శత్రు దుర్భేద్యంగా నిర్మించిన ఈ కోట ఆనవాళ్లు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతే మూడు రాష్ట్రాల (తెలం గాణ, కర్ణాటక, మహారాష్ట్ర) ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారనున్నది.
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఇటీవల ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ఖిల్లాకు తీసుకెళ్లి.. ఆ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. కాగా, కౌలాస్ కోటకు పర్యాటక శోభ అందించేందుకు హామీ కూడా ఇచ్చారు. కౌలాస్ కోట చరిత్ర, ఆ ఖిల్లాలోని ప్రత్యేకతలను ఒకసారి చూసొద్దామా..
ఇది చరిత్ర
కైలాస గిరిదుర్గాన్ని 12వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. 1,323లో యువరాజ్ అలాప్‌ఖాన్(తర్వాత కాలంలో మమ్మద్ బిన్ తుగ్లక్ రాజయ్యాడు) ఈ కోటను జయించినట్టు ప్రస్తావన. ఆయన తండ్రి ఘాజీబేగ్ తుగ్లక్ ఇటీవలే రాజ్యంలో చేరిన వరంగల్ ప్రాంతంలో తిరుగుబాట్లను అణచివేయడానికి పంపించాడు. వారి సేనకు కలరా వ్యాపించడంతో తొలి ప్రయత్నం సఫలం కాలేదు. మలి ప్రయత్నంలో బీదరు, కౌలాస్ ఆ తర్వాత వరంగల్‌ను చేజిక్కించుకున్నాడు. బహుమనీల పాలనలో కౌలాస్ ఖిలాస్ సరిహద్దు కోటగా, గట్టి బలగంతో రక్షింపబడుతూ ప్రముఖ పాత్ర పోషించింది.
పాక్షిక ద్రావిడ శైలిలో నిర్మించిన ఈ కోట నైరుతి బాలఘాట్ కొండల్లో వెయ్యి అడుగుల ఎత్తులో ఒదిగిన ఒక కొండపై ఉన్నది. చుట్టూ దట్టమైన అడవి, కింద నది ఉండటంతో ఇక్కడి ప్రకృతి దృశ్యం అమెజాన్ అడవిని తలపిస్తుంది. కౌలాస్ కోటకు 57 బురుజులు ఉండగా.. లోపల అనేక ఆలయాలు, దర్గాలు ఉన్నా యి. కోట ద్వారాలపై చెక్కిన అలంకరణలు, హృద్యం గా చెక్కిన హిందూ దేవతాశిల్పాలు కోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
కోటకు ఉన్న రెండు ప్రవేశాలకూ స్వాగత తోరణాలుండగా.. వీటిపై గండ బేరుండం వంటి కాకతీయ రాజచిహ్నాలను మనం చూడవచ్చు. పూర్వీకులు చెప్పిన ప్రకారం.. ఈ కోటపై కైలాస్ అనే ముని తపస్సు చేయడం వల్ల దానికి కౌలాస్ ఖిలాస్ పేరొచ్చింది. ఇది కాకతీయుల కాలం నాటిదేనని చరిత్ర చెబుతున్నది. ఈ ఖిల్లా 18 మీటర్ల ఎత్తు, 552 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ కోటలోని ఎల్లమ్మ తల్లిని శివాజీ మహరాజ్ దర్శించుకొని వెళ్లినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఇందులో ఒక సొరంగ మార్గం కూడా ఉన్నట్టు చెబుతారు.
1687లో ఔరంగబేజు.. అబుల్ హసన్ తానీషాను ఓడించి గోల్కొండను మొఘల్ సామాజ్య్రంలో కలుపుకొన్నప్పుడు, కౌలాస్ కోట బాధ్యతను ఇక్లాస్ ఖాన్, ఖునీ ఖాన్ అనే ఇద్దరు ఖిల్లాదార్లకు అప్పగించాడు. వీరిద్దరు ఇక్కడ తమ పేర్లతో పెద్ద మసీదులను కట్టిం చారు. అంధకారంలో ఉన్న కోటకు మూడు ప్రాకారాలతో మూడంచెల రక్షణ వ్యవస్థ ఉన్నది. కోట బురుజులలో మల్లికా, హుస్సేన్, నవజీ, కడీ కా బుర్ద్ ముఖ్యమైనవి. ఇక్కడి నుంచి సుదూర దృశ్య వీక్షణం వీలవుతుంది.
కోటలోని ఆలయాల్లో 1813లో రాణి సోనేకువార్ బాయి కట్టించిన రాజపురానా శైలి రామమందిరం ఉన్నది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని పోలి రాజపుత్ర రాజులు కట్టించిన కాశీకుండ్ ఆలయంలో సహజసిద్ధమైన నీటి ఊట ఉన్నది. కోటలో ఇవే కాకుండా మరో మూడు (రామ, హనుమ, బాలాజీ) ఆలయాలున్నాయి. కోట వెనుక భాగంలో అష్టభుజి మాత (లేదా) జగదాంబ ఆలయం కూడా ఉన్నది. రాజపుత్ర రాజులు యుద్ధానికి వెళ్లే ముందు ఈ ఆలయంలో పార్థనలు చేసేవారు.
కోటలో 16 శతాబ్దానికి చెందిన రెండు మసీదులు(ఇక్లాస్ ఖాన్ మసీదు, ఖూనీ ఖాన్ మసీదు), ఒక దర్గా (షా జియా ఉల్ హబ్ దర్గా), బెహూల్ షా, వలీ సమాధి మందిరం కూడా ఉన్నాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో కోటలో ఉన్న పది ఫిరంగుల్లో ఆరింటిని నాందేడ్, మద్నూర్, బిచ్కుంద పోలీస్‌స్టేషన్లకు తరలించారు. నవగజీ తోప్ అద్భుతమైన లోహనైపుణ్యానికి ప్రతీకగా 500 మీటర్ల మేర విస్తరించి ఉన్న తామరపూల చెరువు కౌలాస్ కోటలో నేటికీ కనువిందు చేస్తున్నది.
మన చరిత్రను కాపాడుకుందాం
పురాతన కోటలు మన చరిత్ర, సంస్కృతికి పత్రీకలు. ఇవి మన పూర్వీకుల ప్రతిభను, శౌర్యాన్ని ప్రతిబింబిస్తాయి. కానీ కాలక్రమేణా ఈ కోటలు శిథిలమవుతున్నాయి. వాటిని పునరుద్ధరించడం అత్యవసరం. స్థానిక పౌరుడిగా ఈ కోటను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులను అభ్యర్థిస్తున్నాను. ఈ కోట పర్యాటక కేంద్రంగా మారితే స్థానిక ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది.
పర్యాటకులు కూడా ఇక్కడి సంస్కృతి, చరిత్రను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన పూర్వీకుల కృషికి గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఇది భావితరాలకు చరిత్రను, సంస్కృతిని అందించడంలో సహాయపడుతుంది. అందరం కలిసి ఈ కోటను పునరుద్ధరణకు కృషి చేసి మన చరిత్రను, సంస్కృతిని కాపాడుకుందాం.
షేక్ ముజీబ్, కౌలాస్, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా
కోటను పర్యాటక కేంద్రంగా మార్చాలి
కౌలాస్ కోటలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందులో ఏనుగుల కొలను, పట్టె మంచం, బందీఖానా వంటివి ఉన్నా యి. అయితే కొన్ని మందిరాల్లో గుప్త నిధులు ఉన్నాయని ఇతర రాష్ట్రాలకు చెందిన కొం దరు ఇక్కడికి వచ్చి రాత్రుళ్లు మందిరాలను కూలగొట్టి విగ్రహాలను ధ్వంసం చేశారు. 10వ శాతబ్దంలో చోళ రాజుల పాలనలో నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలం రాజధా నిగా ఉండేది. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ విశిష్టతలను గమనించిన జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తాను గెలిచాక జనవరి 26న జాతీయజెండాను ఈ ఖిల్లాలోనే ఎగురవేశారు.
గడ్డం విజయ్, కౌలాస్, జుక్కల్ మండలం, కామారెడ్డి జిల్లా






