9 May, 2026 | 2:23 AM

పడకేసిన హౌజింగ్

09-05-2026 12:50 AM

పన్నెండేళ్లుగా నిర్జీవంగా హౌజింగ్ బోర్డు

  1. బోర్డు ఆధీనంలో 2,600 ఎకరాల భూమి
  2. క్యూర్ పరిధిలో పాట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి దరఖాస్తులు
  3. సర్కార్ నుంచి రాని గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన హౌజింగ్ బోర్డు.. సొంత రాష్ట్రంలో పూర్తి గా నిర్లక్ష్యానికి గురైంది. పన్నెండేళ్లుగా కాలనీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో, హైజింగ్ బోర్డుకు పనిలేకుండా పోవడమే కాకుం డా.. పూర్తిగా నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది. గతంలో హౌజింగ్ బోర్డు సంస్థ కూకట్‌పల్లి,  మౌలాలితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో 200లకు పైగా కాలనీలు ఏర్పాటు చేసింది.

రాష్ట్ర విభజనకు ముందు అంటే 2014లో రంగారెడ్డి జిల్లా రావిరాలలో 550 ప్లాట్లు, కూకట్‌పల్లి  పరిధిలో ఒక అపార్ట్‌మెంట్  నిర్మించింది. అందులో 270 ప్లాట్లకు నోటిఫికేషన్ ఇచ్చి 2016 సంవత్సరంలో ఆ ప్రాజెక్టులను పూర్తిచేసి లబ్ధ్దిదారులకు అందజేశారు. విభజన తర్వాత మాత్రం ఒక్క వెంచర్‌కు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్‌ఐజీ, ఎం ఐజీ, హెచ్‌ఐజీ పేరుతో కాలనీలను ఏర్పాటుచేసి సా మాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో స్థలంతో పాటు ఇండ్లను కూడా నిర్మించి ఇచ్చింది.

పేదలు, చిరుద్యోగులకు సొంతింటి కలను నెరవేర్చిందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి భూ ములు కొని వాటిని ప్లాట్లుగా మార్చి ఒక మాదిరిగా ఇళ్లను నిర్మించి.. నో లాస్, నో ప్రాఫిట్ పేరుతో సొంత ఇళ్లను లబ్ధ్దిదారులకు అందించేది. అంతేకాకుండా హౌజింగ్ బోర్డు నుంచి ఇం టిని కొనుగోలు చేస్తే అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయని లబ్ధ్దిదారులు భావిస్తుంటారు. హౌసింగ్ బోర్డులో ఇంటినికొనే లబ్ధ్దిదారుడు ముందుగా 30 శాతం నిధులను చెల్లించాల్సి ఉంటుంది, ఆ తర్వాత బ్యాంకు ల నుంచి రుణం తీసుకొని నెల నుంచి మూడు నెలల్లో బోర్డుకు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. 


హైదరాబాద్, రంగారెడ్డిలోనే..

హౌసింగ్ బోర్డు పరిధిలో రాష్ట్రవ్యాప్తం గా 2,600 ఎకరాల భూములు ఉన్న ట్లు గా సమాచారం. ఇవి ఎక్కువగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే ఉన్నాయని, ఇప్పుడు వాటి విలువ వేలకోట్లలో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డిలోని భూములన్నీ ఔటర్ రింగ్ రోడ్డు లోపలే ఉన్నాయి.

బాటసింగారం, కోహెడ, అబ్దుల్లాపూర్‌మెట్, మంగళపల్లి, తట్టిఅన్నారం, అజీమ్‌నగర్, రావిరాల, చింతల్, వట్టినాగులపల్లి, కౌకూర్,  రాయదుర్గం, గచ్చిబౌలి, నిజాంపేట్, పోచారం, బాచుపల్లి, గాజులరామారం, కొత్తగూడ ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డుకు భూములున్నాయి. అయితే అక్కడక్కడా కొంత భూమి ఆక్రమణకు గురైన ట్లుగా అధికారులు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న భూములకు చుట్టూ ఫెన్సింగ్ లేదా ప్రహరీ నిర్మించడానికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు.

హౌసిం గ్ బోర్డు సొంత నిధులతో భూములు కబ్జా కాకుండా ప్రహరీ, పెన్సింగ్ చేపట్టినా కొన్ని ఏరియాల్లో కబ్జాకు గురైందని చెబుతున్నారు. అంతేకాకుండా డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల పరిధిలోని కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలుస్తోంది. స్వతం త్ర సంస్థగా ఉన్న హౌసింగ్ బోర్డు భూమిని ప్రభుత్వం తీసుకుంటే, అంతే భూమిని ఎక్కడైనా ఇవ్వడం.. లేదంటే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. 

బోర్డుకు పూర్వవైభవం వచ్చేనా? 

రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై హౌసింగ్ బోర్డు సంస్థ ఆశలు పెట్టుకున్నది. ఖాళీగా ఉన్న భూముల చుట్టూ కుడిలు, ప్రహరీల నిర్మాణాలకు కొన్ని నిధులు కేటాయించడమే కాకుండా టౌన్‌షిప్ ఏర్పాటుకు ప్లాన్ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వీటిలో హౌసింగ్ బోర్డుకు అవకాశమిస్తే పేదవర్గాల ప్రజలకు న్యాయం. జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.

క్యూర్ పరిధిలో ఉన్న వివిధ ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డు భూములను ప్లాట్లుగా విభజించి.. కాలనీలు ఏర్పాటుచేసి విక్రయించాలని ఇప్పటికే ప్రభుత్వానికి బోర్డు ప్రతిపాదనలు పంపింది. అయితే సర్కార్ నుంచి ఇంకా అనుమతి రాలేదు. ప్రభుత్వం నుంచి ఎప్పుడు అనుమతి వచ్చినా పనులు మొదలు పెట్టేందుకు హౌజింగ్ బోర్డు సిద్ధ్దంగా ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఎల్‌ఐజీ పరిధిలో 600 చదరపు అడుగులు, ఎంఐజీ పరిధిలో 1,000 చదరపు అడుగులు, హెచ్‌ఐజీ పరిధిలో 1,000కి పైగా చదరపు అడుగుల వరకు ప్లాట్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. 

హౌజింగ్ బోర్డు ఏర్పాటు

మూసీ నదికి వరదలు రావడంతో ఇళ్లు కొట్టుకుపోయి వేలాది మంది నిరాశ్రయులు కావడంతో అప్పటి నిజాం సర్కార్ సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు (సీబీ)ను 1911వ సంద త్సరంలో ఏర్పాటు చేసింది. అప్పుడు మూసీనది వరదలతో నిరాశ్రయులైనవారికి నిజాం సర్కార్ ఇళ్లు నిర్మించిఇచ్చింది. నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కలగడం, ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ గృహనిర్మాణ మండలిగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ గృహనిర్మాణ మండలిగా ఏర్పాటై విధులు నిర్వహిస్తోంది.