దొడ్డి కొమరయ్య... నేటి ప్రజావ్యతిరేక పోరాటలకు స్పూర్తి: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు, దొడ్డి కొమరయ్య జయంతి(Doddi Komaraiah jayanthi) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) ఘన నివాళి అర్పించారు. ప్రజా వ్యతిరేక పాలన మీద తెలంగాణ ప్రజల తిరుగుబాటుకు సంకేతంగా నిలిచిన కొమరయ్య అమరత్వం, నాటి రాచరిక పాలకుల నుంచి నేటి ప్రజా వ్యతిరేక పాలకుల మీద సాగుతున్న ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిందని కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించి, అనంతరం పదేళ్ల పాటు బాలారిష్టాలను అధిగమించి, స్వయం పాలనను దేశానికే ఆదర్శంగా నిలబెట్టుకోవడంలో అమరుల త్యాగాల స్ఫూర్తి ఇమిడి ఉన్నదని తెలిపారు. తమ ఆత్మగౌరవం, సామాజిక సమానత్వం, రాజకీయ హక్కుల కోసం తెలంగాణ సబ్బండ కులాల పోరాటాన్ని పాలక ప్రభుత్వాలు గుర్తించి, రాజ్యాంగపరమైన హక్కులను అందించగలిగిన నాడే, దొడ్డి కొమరయ్య వంటి ఎందరో తెలంగాణ అమరులు, త్యాగధనులకు నిజమైన ఘన నివాళి అర్పించినట్లు అవుతోందని కేసీఆర్ వెల్లడించారు.




