10 June, 2026 | 1:54 PM

సిద్దాపూర్ రిజర్వాయర్ కు చేరుకున్న మంత్రి ఉత్తమ్

10-06-2026 12:54 PM

హెలికాప్టర్ ద్వారా చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం

హెలికాప్టర్ వద్ద భారీగా తరలివచ్చిన ప్రజలు, కార్యకర్తలు

పూలు జల్లుతూ మంత్రికి స్వాగతం పలికిన మహిళలు

సిద్ధపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

మంత్రి రాకతో సందడిగా మారిన సిద్ధపూర్ రిజర్వాయర్ పరిసరాలు

బాన్సువాడ,జూన్ 10 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ కు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ సురేష్ షెట్కార్ హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. మంత్రి రాక సందర్భంగా రిజర్వాయర్ పరిసర ప్రాంతం జనసందోహంతో కిక్కిరిసిపోయింది. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అక్కడికి చేరుకుని మంత్రికి ఘన స్వాగతం పలికారు.

హెలికాప్టర్ ల్యాండ్ అయిన వెంటనే ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర  ఘన స్వాగతం పలికారు.మహిళలు పూలు జల్లుతూ మంత్రిని ఆహ్వానించగా, కార్యకర్తలు నినాదాలతో పరిసర ప్రాంతాన్ని మార్మోగించారు. మంత్రికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛాలు అందజేశారు. మంత్రి రాకతో సిద్దాపూర్ రిజర్వాయర్ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించింది.

అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, పనుల నాణ్యత, పూర్తికి పట్టే గడువు వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. రిజర్వాయర్ పూర్తయితే పరిసర ప్రాంతాల రైతులకు సాగునీటి సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు.