6 ఏళ్ల బాలుడికి కీ హోల్ సర్జరీ
అరుదైన ఫ్యూజ్డ్ కిడ్నీపై ఏఐఎన్‌యూలో చికిత్స
హైదరాబాద్, జూలై 16 (విజయక్రాంతి): పుట్టుకతోనే వచ్చే అత్యంత అరుదైన ’క్రాస్డ్ ఫ్యూజ్డ్ ఎక్టోపిక్ కిడ్నీ’ సమస్యతో పాటు కిడ్నీలో క్యాన్సర్ గడ్డతో బాధపడుతున్న ఆరేళ్ల బాలుడికి హైదరాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) వైద్యులు అత్యాధునిక లాపరోస్కోపిక్ (కీహోల్) శస్త్రచికిత్స ద్వారా గడ్డను విజయవంతంగా తొలగించారు.
3డీ ఇమేజింగ్, ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్, ఐసీజీ ఫ్లోరోసెన్స్ సాంకేతికతలతో ఆరోగ్యకరమైన కిడ్నీ భాగాన్ని కాపాడుతూ శస్త్రచికిత్స నిర్వహించినట్లు ఏఐఎన్‌యూ డైరెక్టర్ (రోబోటిక్స్ అండ్ మినిమల్ యాక్సెస్ యూరాలజీ) డాక్టర్ సయ్యద్ ఎండీ గౌస్ తెలిపారు. బాలుడి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గరిష్టంగా కిడ్నీ పనితీరును సంరక్షించామని మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ మల్లికార్జున సి వెల్లడించారు.
ప్రస్తుతం బాలుడు పూర్తిగా కోలుకుని సాధారణ కిడ్నీ పనితీరుతో డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. ఈ శస్త్రచికిత్సను డాక్టర్ సయ్యద్ ఎండీ గౌస్, డాక్టర్ మల్లికార్జున సి, కన్సల్టెంట్ యూరో-ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ కుమార్ రెడ్డి అడపాల బృందం విజయవంతంగా పూర్తి చేసింది.






