17 July, 2026 | 12:12 AM

ఆర్టీసీలో అరాచకం!

17-07-2026 12:12 AM

అదుపుతప్పిన నల్లగొండ డిపో నిర్వహణ

ఉచిత ప్రయాణం.. ఉడికిపోతున్న జనం..

పల్లె వెలుగులు రావు.. ఎక్స్ప్రెస్లు ఆపరు.. 

నల్లగొండ డీఎం నిర్లక్ష్యం.. ఆర్‌ఎం ఉదాసీనత

ఎంజీయూ సిబ్బంది, విద్యార్థుల రోదన

కట్టంగూరు, జూలై 16: ప్రభుత్వ ఆశయం గొప్పదే కావచ్చు.. కానీ దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన వ్యవస్థలు కుప్పకూలితే సామాన్యుడికి నరకం ఎలా ఉంటుందో చెప్పడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ ప్రస్తుత తీరే నిదర్శనం. ’మహాలక్ష్మి’ పథకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళల ప్రయాణ భారం తగ్గిందేమో కానీ, వారి ఆత్మగౌరవానికి మాత్రం ప్రతిరోజూ బస్సుల్లో భంగం కలుగుతూనే ఉంది. పక్కనే రీజనల్ మేనేజర్ కార్యాలయం ఉన్నా, నల్ల గొండ డిపో అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా పడకేసింది.

ఒకపక్క సమయపాలన లేని సర్వీసులు, మరోపక్క ప్రయాణికుల పట్ల సిబ్బంది అమానుష వైఖరితో జిల్లాలో ఆ ర్టీసీ ప్రయాణమంటేనే జనం జంకుతున్నా రు. ప్రభుత్వమేమో ఉచిత ప్రయాణానికి ప్రతి పైసా చెల్లిస్తున్నా.. సిబ్బంది మాత్రం తమ సొంత జేబుల్లోంచి ఉచితంగా తిప్పుతున్న ట్టు ప్రవర్తిస్తుండడం వెనుక అధికారుల పర్యవేక్షణా లోపం స్పష్టంగా కనిపిస్తోంది. ‘బస్సు ఎవ్వరూ ఎక్కమన్నారు? మీకోసం తిప్పుతున్నామా? ఒళ్లు కొవ్వెక్కిందా?‘ ఇవీ నిత్యం నల్లగొండ జిల్లాలో ప్రయాణించే మహిళలపై ఆర్టీసీ సిబ్బంది కురిపిస్తున్న బూతు మాటలు.

ఉచిత ప్రయాణం మహిళల హ క్కుగా మారితే, దాన్ని అణచివేయడం తమ బాధ్యతగా భావిస్తున్నారు కొందరు డ్రైవర్లు, కండక్టర్లు. విద్యార్థులు, మహిళా ఉద్యోగులు గమ్యస్థానాలకు చేరాలంటే దేవుడిపై భారం వేయాల్సిన దుస్థితి నెలకొంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ స్టాప్లో బస్సులు ఆప కపోగా, ప్రశ్నించిన మహిళా సిబ్బందిని కన్నీ రు పెట్టించడం ఇక్కడి అరాచక పాలనకు అ ద్దం పడుతోంది. వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన డిపో మేనేజర్ వసూళ్లపైనే శ్రద్ధ పెడు తూ, బాధితుల ఫిర్యాదులను ఎగతాళి చే స్తుంటే.. ఆర్టీసీలో అసలు జవాబుదారీతనం ఉందా లేదా అనే ప్రశ్నలు ఉమ్మడి జిల్లా ప్రజల నుంచి తలెత్తుతున్నాయి.

పల్లె వెలుగులు రావు.. ఎక్స్ప్రెస్లు ఆపరు..!: 

నల్లగొండ జిల్లా పరిధిలో రవాణా వ్యవస్థ ‘ఎక్కితే మెయిన్ బస్టాండ్.. లేకుంటే గంటల తరబడి వెయిటింగే‘ అన్న చందంగా మారింది. ఒక పట్టణం నుంచి మరో పట్టణానికి మధ్యలో ఉన్న గ్రామీణ ప్రయాణికుల పరిస్థితి వర్ణనాతీతంగా తయారైంది. బస్సు లు వస్తే వరుసగా ఒకదాని వెంట ఒకటి వస్తాయి, లేదంటే గంటల తరబడి ఊసే ఉండదు. బస్సుల నిర్వహణను గాలికొదిలేసిన నల్లగొండ డిపో మేనేజర్, కేవలం ’కా సుల వసూళ్ల’ పైనే శ్రద్ధ పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘బస్సు ఎవ్వ రూ ఎక్కమన్నారు? మా కోసం ఎక్కుతున్నావా? పనిపాటా లేక తిరుగుతున్నా రా?‘ అంటూ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులపై చెప్పుకోలేని భాషలో విరుచుకుపడుతు న్నారు. ఉచిత ప్రయాణం అంటే ఆర్టీసీ సిబ్బంది సొంత జేబుల్లోంచి తిప్పుతున్నట్టు ప్రవర్తించడం పట్ల మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

ఎంజీయూ విద్యార్థులు, మహిళా సిబ్బంది గోస.. : 

నల్లగొండ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది నిత్యం నరకం చూస్తున్నారు. యూనివర్సిటీ వద్ద అధికారిక స్టాప్ ఉన్నప్పటికీ బస్సులు ఆపడం గగనంగా మారింది. ఇటీవల భువనగిరి వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సు ఎక్కిన ఓ యూనివర్సిటీ మహిళా సిబ్బందిని, డ్రైవర్ దారుణమైన బూతులతో అవమానించాడు. ‘యూనివర్సిటీ వాళ్లు ఎక్కితే మిగతా వాళ్లు ఎక్కడ ఎక్కాలి? కండ్లు కన్పించడం లేదా? ఒళ్లు కొవ్వెక్కిందా?‘ అంటూ ఒక మహిళ అని కూడా చూడకుండా మాట్లాడటంతో ఆమె కన్నీటి పర్యంతమైనట్లు తోటి ప్రయాణికులు చెబుతున్నారు.

అంతకుముందు ఇలాంటి మరో విషయంలో విద్యార్థులు గతంలో డీఎంకి ఫిర్యాదు చేస్తే.. కక్షసాధింపుగా ఉన్న ఒకటి రెండు బస్సులను కూడా ఆపకుండా పోతుండడం అధికారుల అహంకారానికి పరాకాష్ట అని స్థానికులు అంటున్నారు. ఇదిలావుంటే.. బస్సుల్లో సీట్ల విషయమై ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతుంటే సర్దిచెప్పాల్సిన డ్రైవర్, కండక్టర్లు.. తామే స్వయంగా ప్రయాణికులపై రుసరుసలాడుతున్నారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రయాణికులు ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని కొట్టుకునే పరిస్థితి వస్తున్నా కండక్టర్లు మూగప్రేక్షకుల్లా వ్యవహరిస్తున్నారు.

కొరవడిన జవాబుదారీతనం:

ఉమ్మడి నల్లగొండ ఆర్టీసీలో జవాబుదారీతనం పూర్తిగా శూన్యమైంది. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు. ఇటీవల ఓ బాధితులు ఫోన్ ద్వారా రీజనల్ మేనేజర్కు ఫిర్యాదు చేస్తే.. యాక్షన్ తీసుకోవాల్సింది పోయి, ‘బస్టాండ్కు వచ్చి డీఎంకు కంప్లైంట్ ఇవ్వండి‘ అంటూ బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారు. సదరు బాధితురాలు డీఎంకి ఫోన్ చేస్తే.. డ్రైవర్ను మందలించాల్సింది పోయి, ‘మిమ్మల్ని ఎక్స్ప్రెస్ బస్సు ఎవరు ఎక్కమన్నారు? పల్లె వెలుగు ఎక్కండి‘ అంటూ రివర్స్లో క్లాస్ పీకినట్లు బాధితురాలు చెప్పింది.

దాంతో ఆర్టీసీ సిబ్బంది వేధింపులు భరించలేక సదరు మహిళా ఉద్యోగి ఆర్టీసీ ప్రయాణాన్ని మానేసి, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది. చదువుకున్న ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక అక్షరం ముక్క రాని పల్లెటూరి అమాయక ప్రజలపై ఆర్టీసీ సిబ్బంది ఇంకెంత అరాచకంగా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రయాణం ఉచితమే కావచ్చు.. కానీ ఆర్టీసీకి కాదు.

ప్రతి రూపాయిని ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో రీఅంబర్స్ చేస్తోంది. అలాంటప్పుడు మహిళా ప్రయాణికుల పట్ల ఇంత చిన్నచూపు, వివక్ష ఎందుకు? ఇప్పటికైనా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆర్టీసీ బాస్ స్పందించి, ప్రయాణికుల పట్ల అనాగరికంగా ప్రవర్తిస్తున్న డ్రైవర్లు, కండక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎంజీయూ వంటి స్టాపుల వద్ద బస్సులను ఆపాలని, మొత్తానికి నల్లగొండ డిపో నిర్వహణను పట్టాలెక్కించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.