20కిలోల గంజాయి పట్టివేత
ఇద్దరు వ్యక్తుల అరెస్టు
మహబూబాబాద్, జులై 14 (విజయక్రాంతి): విశ్వసనీయ సమాచారం మేరకు మహబూబాబాద్ జిల్లా గూడూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ బి. గిరిధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బ్రాహ్మణపల్లి గ్రామంలోని తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న మూడు బ్యాగులను పరిశీలించగా మొత్తం 20.898 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10,44,900 ఉంటుందని అంచనా వేశారు. ఈ సంఘటనకు పాల్పడ్డ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన గురు లోకనాథ్ పాత్రా, ఇజ్రాయిన్ ఖాసిం సంద్వాని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణలో నిందితులు ఒడిశా రాష్ట్రంలోని బెరహంపూర్ ప్రాంతం నుండి గంజాయిని కొనుగోలు చేసి గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరానికి అక్రమంగా తరలించి విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు వెల్లడైంది. ఈ కేసులో గంజాయితో పాటు మూడు బ్యాగులు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులపై ఎన్ డీ పీ ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ ఐ తెలిపారు.






