కాంగ్రెస్‌కు పరీక్ష
ప్రతిష్ఠాత్మకంగా ఖైరతాబాద్
ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో విజయం..
హ్యాట్రిక్‌పై పార్టీ అధిష్ఠానం కన్ను
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఉప ఎన్నిక(Khairatabad By Election) అధికార కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షగా మారనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) సిట్టింగ్ స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీకి.. ఇప్పుడు ఖైరతాబాద్ లోనూ జెండా ఎగురవేయడం ప్రతిష్ఠాత్మకంగా మారింది. మూడో ఉప ఎన్నికలోనూ విజయాన్ని నమోదు చేసి గ్రేటర్ లో తన పట్టు మరింత పెంచుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం వ్యూహరచన చేస్తోంది.
నియోజకవర్గంలో రాజకీయ పరిస్థి తులు, పార్టీల బలాబలాలు, టికెట్ ఆశావహులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఉప ఎన్నికకు మార్గం సుగమమైంది. దీంతో అధికార కాంగ్రెస్‌తో పాటు బీఆర్ ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు కూడా ఉప ఎన్నికను ప్రతి ష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.
మూడేళ్లలో మూడో ఉప ఎన్నిక..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రేటర్ హైద రాబాద్ పరిధిలో ఇది మూడో ఉప ఎన్నిక కానుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపి నాథ్ మృతితో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో కాం గ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఖైరతాబాద్‌ను సైతం తన ఖాతాలో వేసుకోవడం కాంగ్రెస్‌కు రాజకీయంగా కీల కంగా మారింది.
ఖైరతాబాద్ కూడా గ్రేటర్ పరిధిలోనే కావ డంతో.. రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకిత్తిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచి.. ఆరు నెలలు తిరగకముందే కాంగ్రెస్ గూటికి చేరారు. అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. దానం నాగేందర్‌పై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడిన విషయం తెలిసిందే. ఖైరతాబాద్ సీటును కూడా హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ అధి ష్ఠానమే రంగంలోకి దిగింది.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రాతిని ధ్యం వహించే సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోనే ఖైరతాబాద్ నియోజకవర్గం ఉంది. గతంలో జూబ్లీహిల్స్ కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోనే ఉన్నప్పటికీ.. బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. గతంలో ఖైరతాబాద్ నుంచి బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. త్వరలో జరిగే ఉప ఎన్నిక ఎవరి ఖాతాలోకి వెళ్లుతుందనేది రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.
బలాబలాలపై సర్వేలు
ఖైతరాబాద్ నియోజకవర్గంలోని ఆయా రాజకీయ పార్టీల బలాబాలలు, మారుతున్న సామాజిక సమీకరణాలతో పాటు గెలుపు అవకాశాలపై కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి ఏఐసీసీ నాయకత్వం పూర్తిస్థాయి నివేదిక కోరినట్లు తెలిసింది. నియోజకవర్గంలో దానం నాగేందర్ ప్రభావం ఎంత? పార్టీ గుర్తుపై పోటీ చేస్తే ప్రజల నుంచి స్పందన ఎలా ఉంటుంది? ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఎవరెవరున్నారు? వారి ప్రభావం ఎలా ఉంటుంది? అనే అంశాలపై వివరాలను సేకరించేందుకు కాంగ్రెస్ప పార్టీ సన్నద్దమవుతోంది.
గత పొరపాట్లు పునరావృతం కాకుండా రెండు, మూడు స్వంతంత్ర సంస్థల ద్వారా సర్వే నిర్వహించి నివేదికలు పరిశీలించిన తర్వాతనే టికెట్ కేటాయింపై తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయించినట్లుగా గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. టికెట్ ఆశించే ఆశావహుల పేర్లతో పాటు.. పార్టీ గుర్తుపైన వేర్వేరుగా రెండు సర్వేలు, ఓరల్‌గా ఒక సర్వే చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలిసింది. అయితే ఖైరతాబాద్ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పి.విజయారెడ్డి, రోహిన్‌రెడ్డితో పాటు స్థానికంగా మరో ఇద్దరు, ముగ్గురు సీనియర్ నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఫలితం తేడా వస్తే భవిష్యత్ ఎన్నికలకు ప్రమాదమే!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే డిసెంబర్‌తో మూడేళ్లు పూర్తి కావస్తుంది. తమ ప్రభుత్వం చేపట్టే అభివృద్ది, సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో గతం కంటే మరింత ఆదరణ లభిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు భారీగా పెరిగాయని ఆరోపిస్తున్నారు.
అన్ని వర్గాలను మోసం చేయడంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగ హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపిస్తున్నాయి. అయితే ఉప ఎన్నికల ఫలితం ఏమాత్రం తారుమారైనా.. భవిష్యత్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం ఉంటుందనే భయం కాంగ్రెస్ నేతలకు పట్టుకున్నది.
అయితే గత బీఆర్ఎస్ చేయని అభివృద్ధి పనులను చేపట్టడమే కాకుండా పేద వర్గాలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని.. ప్రజలు కూడా కాంగ్రెస్‌ను ఆదరిస్తారనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌కార్డులు, సన్న బియ్యం, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందతున్నాయని, వారందరు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారని చెబుతున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఖైరతాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు అగ్నిపరీక్షగానే మారనుంది.