‘ఖాకీ’లకు ‘కొరత’ కష్టాలు.!
- కంటిమీద కునుకు కరువు
- కేసుల విచారణకు అడ్డు
మహబూబాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిం దన్న చందంగా పోలీసులకు ‘కొరత’ కష్టాలు పట్టిపీడిస్తున్నాయి. రేయింబవళ్లు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మేడ సంఘటనల దర్యాప్తు చేపట్టాల్సిన పోలీసులకు గత కొద్ది నెలల నుండి ‘కొరత’ కష్టాలు పట్టిపీడిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ విధి నిర్వహణ గాలికి వదిలేసి నిద్రాహారాలు మాని బందోబస్తు డ్యూటీ చేయడం అస్తమానంగా మారిందని వాపోతున్నారు.
కొద్ది నెలల క్రితం యూరియా కొరత జిల్లావ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడి, పోలీసులు లేనిదే యూరియా పంపిణీ చేయలేని పరిస్థితి తలెత్తింది. యూరియా కొరత సుమారు నెలరోజుల పాటు పూర్తిగా యూరియా పంపిణీకే పోలీసుల సేవలను వినియోగించారు. ఇక డిసెంబర్ నెలలో పంచాయతీ ఎన్నికల బందోబస్తు తోనే గడిచిపోయింది. జనవరి నెలలో మేడారం జాతర బందోబస్తు, ఇక ఆ తర్వాత ఫిబ్రవరిలో మున్సిపాలిటీ ఎన్నికల బందోబస్తుతో కాలం గడిచిపోయింది.
మార్చి నెలలో గ్యాస్ కొరత ఇబ్బందులకు తోడు మొక్కజొన్న అమ్మకాల ఇబ్బందులు తోడయ్యాయి. ఇక ఏప్రిల్ నెలలో మొక్కజొన్నల విక్రయాల సమస్యకు అదనంగా పెట్రోల్, డీజిల్ కొరతతో ఇబ్బందులు తలెత్తడంతో పోలీసులు గత కొద్దిరోజులుగా పెట్రోల్ పంపుల వద్దే గస్తీ నిర్వహిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లు, మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్, డీజిల్ పంపులు, గ్యాస్ డీలర్ల వద్ద పోలీసుల బందోబస్తు గత కొద్దిరోజులుగా కొనసాగుతోంది.
దీనితో జిల్లా వ్యాప్తంగా ఇతర నేర పరిశోధనలు, లా అండ్ ఆర్డర్ సంబంధిత అంశాలను, నేరాల అదుపు పై దృష్టి పెట్టలేని పరిస్థితి పోలీసులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. గత వారం రోజుల నుండి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు, పెట్రోల్, డీజిల్ పంపులతో పాటు గ్యాస్ ఏజెన్సీ డీలర్ల వద్ద రద్దీని కట్టడి చేయడానికి సివిల్ పోలీసులతోపాటు స్పెషల్ పార్టీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.
దెబ్బతింటున్న ఆరోగ్యం
నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు సివిల్, స్పెషల్ పార్టీ పోలీసులు, అధికారులు ‘కొరత’ల నేపథ్యంలో బందోబస్తు నిర్వహిస్తుండడంతో ఆరోగ్యం దెబ్బతింటున్నట్టు వాపోతున్నారు. జిల్లావ్యాప్తంగా ‘కొరత’ల నేపథ్యంలో పెద్ద ఎత్తున జనం ఒకే చోట చేరడం, అలాగే వేల సంఖ్యలో రైతులు వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి రావడం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో పోలీసుల బందోబస్తు నిర్వహిస్తుండడం వల్ల నిత్యం వారి వృత్తి ఉత్కంఠ భరితంగా సాగుతున్నట్లు చెబుతున్నారు.
వేలాపాల లేకుండా పోలీసులు బందోబస్తు డ్యూటీ విధులు నిర్వహించాల్సి వస్తుండడంతో చాలామంది పోలీసులు వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి తిండి నిద్ర లేకుండా పోతుందని, దీనికి తోడు ఇటీవల జిల్లాలో ఈ ‘కొరత’ల సమస్య ఉత్పన్నమవడంతో పోలీసుల బందోబస్తు తప్పనిసరిగా మారిందని చెబుతున్నారు. గత ఐదు నెలల నుండి అదే పనిగా బందోబస్తు డ్యూటీలతో పోలీసుల ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుతున్నారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి పోలీసుల ఆరోగ్య భద్రత అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఇబ్బందులు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.






