4 August, 2026 | 1:49 AM

అనంతపురంలో కొరియన్ కల్చర్ ఆశ్చర్యమేసింది!

04-08-2026 12:39 AM

వరుణ్‌తేజ్ హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమాను హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. యూవీ క్రియేషన్స్, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు గాంధీ చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే.. “-నేను కొంతమంది స్నేహితులతో కలిసి అనంతపురం మీదుగా ఒక పెళ్లికి వెళ్లా. అప్పుడు కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగినప్పుడు అక్కడ పనిచేసే కొరియన్ల కోసం ఒక కమ్యూనిటీ, వాళ్ల కల్చర్‌కు తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయని తెలిసి, నాకు చాలా ఆసక్తిగా అనిపించింది.

అప్పుడే అనంతపురాన్ని, కొరియాను కలిపే కథ ఆలోచన వచ్చింది. ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రాడిని ఆవహిస్తే ఎలాంటి కామెడీ పుడుతుంది? అని ఈ కథను రాశా. ఈ కథలో కనకరాజుతో కొరియన్ పాత్ర ఉంటుంది. ఈ రెండు షేడ్స్‌కు సరిపోయే నటుడు వరుణ్‌తేజ్ అనిపించింది. మొదట వరుణ్‌తేజ్ కోసం మరో కథ అనుకున్నా. అది చెప్పిన తర్వాతే ఈ కొరియన్ పాయింట్ కూడా చెప్పా. ఆయన దీన్ని డెవలప్ చేయమన్నారు. పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైన తర్వాత ఆయనకు చాలా నచ్చింది.

కొన్ని చిన్న మార్పులు, మంచి సలహాలూ ఇచ్చారు. ఈ సినిమాలో రీతిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఆమెకు కొరియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. నిజానికి తనకు కొరియన్ భాష కూడా తెలుసు. ఆమె లుక్ కూడా ఆ కల్చర్‌కు బాగా మ్యాచ్ అవుతుంది. సినిమాలో ఆమెకు చాలా కొరియన్ డైలాగులున్నాయి. అందుకోసం కొరియా నుంచి ఒక ట్యూటర్‌ను తీసుకొచ్చి హీరో, హీరోయిన్ ఇద్దరికీ కొరియన్లో శిక్షణ ఇచ్చాం. కథ అనుకున్నప్పుడే కొరియాలో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.

అక్కడ షూటింగ్ చాలా ఖరీదైనది. అందుకే పరిమితమైన క్రూతో వెళ్లి చిత్రీకరించాం. కొంత భాగాన్ని కజకిస్థాన్‌లో కూడా షూట్ చేశాం. దీనికి సీక్వెల్ చేయాలన్న ఆలోచనైతే ఉంది. -ప్రస్తుతం ఓ కథపై పని చేస్తున్నా. అది కూడా కామెడీ థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది. కామెడీ నాకు చాలా కంఫర్ట్‌గా అనిపించే జానర్. మా నాన్న కూడా కథా రచయితే. కానీ ఆయన టేస్టుకు, నా టేస్టుకు తేడా ఉంటుంది. ఆయనకు రొమాంటిక్ కథలు ఇష్టం. నాకు ఫన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ చేయడం ఇష్టం. అయినా, నాన్న కథతో ఒక సినిమా చేయాలన్న ఆలోచన ఉంది” అని చెప్పారు.