3 May, 2026 | 11:21 AM

డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం

15-03-2026 04:56 PM

హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కౌంటర్‌ వేశారు. డ్రగ్స్‌ కేసులోకి తన పేరును లాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, నోటీసులతో సమాధానం ఇస్తానని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాను. మత్తుమందులు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు డ్రగ్స్‌ వాడటం దురదృష్టకరమని మండిపడ్డారు. డ్రగ్స్‌, నిషేధిత పదార్థాల వాడకానికి తను పూర్తిగా వ్యతిరేకం అని కేటీఆర్‌ అన్నారు. డ్రగ్స్ టెస్టు చేయించుకోవాలన్న మహేష్ గౌడ్ సూచనను తను స్వీకరిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. మా పార్టీ బీఆర్ఎస్ మాదకద్రవ్యాల వాడకాన్ని, ఏదైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఖండిస్తుందన్నారు. 

మాదకద్రవ్యాలను ఉపయోగించే, విక్రయించే ఎవరినైనా వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా చట్టం ప్రకారం కఠినంగా శిక్షించాలని కేటీఆర్ సూచించారు. అయితే, అత్యంత విచారకరమైన ఈ పరిస్థితిలోకి బీఆర్ఎస్ పార్టీని లాగుతున్న తీరును తను తీవ్రంగా ఖండిస్తున్నానని, బీఆర్ఎస్ తో పాత లెక్కలు తేల్చుకోవడానికి మాదకద్రవ్యాల కేసును వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమని ఆయన ఎద్దేవా చేశారు. ఏ పరీక్షకైనా సిద్ధమేనని ఇప్పటికే పలుమార్లు పునరుద్ఘాటించానని, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ పరీక్షకు హాజరుకావాలన్న మహేష్ కుమార్ గౌడ్ సూచనను నేను స్వాగతిస్తున్నాను. ఇందుకు మనమే ఆదర్శంగా నిలుద్దాం అని కేటీఆర్ చెప్పారు.