చెయ్యి విరగాలె.. పువ్వు వాడిపోవాలె
కారు’ రయ్‌మని దూసుకెళ్లాలె !
కొత్త జిల్లాలు రద్దు చేస్తే ఉద్యమం తప్పదు
నేతన్నలకు అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వమే..
కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది..
ప్రధాని మోదీతో తెలంగాణకు పైసా ఉపయోగం లేదు
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి): ‘లోక్‌సభ ఎన్నికల్లో రయ్‌మని ‘కారు’ దూసుకెళ్తుంటే ‘చెయ్యి’ విరగాలె.. ‘పువ్వు’ వాడిపోవాలె అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. శనివారం ఆయన పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్ గెలుపు కోసం సిరిసిల్లలో విస్తృతంగా పర్యటించారు. రైతు బజార్‌లో రైతులు, వ్యాపారులతో మాట్లాడి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం స్థానిక తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సిరిసిల్లకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ హయాంలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయని, సీఎం రేవంత్‌రెడ్డి కొత్త జిల్లాలను కొనసాగిస్తామని చెప్పలేకపోతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేనేత కార్మికులకు రూ.3 వేల కోట్ల బతుకమ్మ ఆర్డర్ ఇచ్చామని, తద్వారా కార్మికులను ఆదుకున్నామని గుర్తుచేశారు. హైదరాబాద్ నడిబొడ్డున 130 ఫీట్ల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తే, కనీసం విగ్రహానికి దండ కూడా వేయలేని మూర్ఖుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.
కొత్త జిల్లాలను రద్దు చేస్తామంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిరిసిల్లలో నేత కార్మికులకు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కంటే ఎక్కువగా ఆర్డర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీల హామీలపై అబద్ధాలు, అసత్యాలను ప్రజలు ఛీత్కరించుకుంటున్నారన్నారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు సీఎం రుణమాఫీపై తేదీలు మార్చుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీతో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా లాభం జరగలేదని విమర్శించారు. సిరిసిల్లకు బీజేపీకి ఏమి ఇచ్చిందో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజలకు తెలియజేయాలని సవాల్ విసిరారు. బీఆర్‌ఎస్ హయాంలో యాదాద్రి ఆలయం కట్టించామని, రిజర్వాయర్లు కట్టి దేవుళ్ల పేర్లు పెట్టామని గుర్తుచేశారు. తాము ఏనాడూ దేవుళ్ల పేరు చెప్పి ఓట్లు అడుగలేదని చెప్పారు. మతం పేరిట బీజేపీ చేసే ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని కోరారు. బీజేపీ పుట్టకముందే దేవుళ్లు ఉన్నారని పేర్కొన్నా రు. బీఆర్‌ఎస్ పాలనలో ఎప్పుడు సిరిసిల్ల బ్రిడ్జి కింద నీళ్లు ఉండేవని, కాంగ్రెస్ రాగానే నీళ్లు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికీ రైతుబంధు అందని రైతులు ఎంతోమంది ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి 12 మంది ఎంపీలుగా గెలిస్తే పార్టీ అధినేత కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తారని స్పష్టంచేశారు. సమావేశంలో పార్టీ నేతలు తోట ఆగయ్య, కళ, తుల ఉమ, చక్రపాణి పాల్గొన్నారు.
సాయన్న కుటుంబానికి అండగా ఉందాం
జనం గుండెల్లో నిలిచిన నాయ కుడు సాయన్న కుటుంబానికి అండగా నిలుద్దామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. సాయన్న కుమార్తె నివేదితకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కంటోన్మెంట్ ప్రజలను కోరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని అన్నానగర్ చౌరస్తాలో నివేదితకు మద్దతుగా శనివారం జరిగిన రోడ్డుషోలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. దివంగత ఎమ్మెల్యేలు సాయన్న, లాస్య నందితలను ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న లాస్యనందితను మృత్యువు వెంటాడటంతో అంద రం షాక్‌కు గురయ్యామని అన్నారు. ఒకే ఏడాదిలో కుటుంబంలోని ఇద్దరు మరణించడం బాధాకరమని చెప్పారు. ఆ కుటుంబానికి అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కంటోన్మెంట్‌తోపాటు మల్కాజిగిరి ఎంపీ ఎన్నికల్లోనూ బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కోరారు.
ఎన్డీఏ, ఇండియా కూటమికి మా మద్దతు ఉండదు
కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు వెళతామే తప్ప.. ఎన్డీఏ, ఇండియా కూటమిలకు తమ మద్దతు ఉండదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ షాపూర్‌నగర్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన రోడ్‌షోకు కేటీఆర్ హాజరై, మాట్లాడారు. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని కాంగ్రెస్ సిగ్గులేకుండా చెప్పుకొంటుందని, ఎక్కడ అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. లగ్గం చేసుకుంటే తులం బంగారం రాలేదు, మహిళలకు రూ.2500 రాలేదు, రైతులకు రుణమాఫీ కాలేదని చెప్పారు. తాము కష్టపడి పరిశ్రమలను తెస్తే.. రేవంత్‌రెడ్డి వైఖరి వల్ల అవి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. విద్యుత్తు ఉంటేనే పరిశ్రమలు నడుస్తాయని, ప్రస్తుతం విద్యుత్తు కోతలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు. నగరంలో జనరేటర్లు, వాటర్ ట్యాంకర్లే కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.
బీజేపీ, కాంగ్రెస్ చీకటి ఒప్పందం చేసుకొన్నాయనీ, బడా భాయ్, చోటా భాయ్ ఇద్దరూ ఇద్దరేనని విమర్శించారు. బీజేపీ గెలుపు కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలిపిందని ఆరోపించారు. రాగిడి లక్ష్మారెడ్డి లోక్‌ల్ అని, మిగతా ఇద్దరు నియోజకవర్గానికి టూరిస్టులు అని స్పష్టంచేశారు. తాము ఏ కూటమికి మద్దతు ఇవ్వమని, అవసరమైతే 13 ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో చక్రం తిప్పుతామని అన్నారు. అభివృద్ధి చేసుకున్న హైదరాబాద్ కావాలా? మత విద్వేషాలను రెచ్చగొ డుతూ బీజేపీ తెచ్చే విషనగరం కావాలా? అని ప్రశ్నించారు. కేసీఆర్ పంపిన రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తదితరులు పాల్గొన్నారు.




