బలహీన వర్గాల అభివృద్ధే కాంగ్రెస్ లక్ష్యం
పథకాలను పక్కాగా అమలు చేస్తాం
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు
కులమతాల పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోంది
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
మునుగోడు (నాంపల్లి), మే 4: బీఆర్‌ఎస్, బీజేపీలు కమీషన్ల కోసం పనిచేస్తే.. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్‌తో కలిసి మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల కేంద్రంలో శనివారం వారు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే ప్రధాని మోదీ ఏం చేయలేకపోయారని ఆరోపించారు. రాష్ట్ర విభజన హామీల ప్రకారం తెలంగాణకు రావాల్సిన నిధులు రాలేదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి పరిమితమై పాలనను గాలికొదిలేసిండని మండిపడ్డారు.
రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు జైలుకుపోక తప్పదని హెచ్చరించారు. పేద, మధ్య తరగతి వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నిర్వీర్యం చేస్తోందని పేర్కొన్నారు. కులమతాల పేరుతో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన పథకాలన్నీ దశల వారీగా అమలు చేస్తామని, ఇప్పటికే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని, పంద్రాగస్టు నాటికి పక్కాగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.
కిరణ్‌కుమార్ రెడ్డిని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ప్రజల గొంతుకనై సమస్యలపై పార్లమెంట్‌లో ప్రశ్నిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా గొల్ల కురుమలు వారికి గొర్రె పిల్లలను బహుకరించారు. రోడ్ షోలో పీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, నాంపల్లి జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, నాంపల్లి వైస్ ఎంపీపీ వెంకటయ్య, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొజ్జ సంధ్య రెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు, సీపీఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




