లక్ష్మాపురం.. పరిశుభ్రతలో అధ్వాన్నం
- 50 ఏళ్లుగా ఊరు మొత్తానికి ఒకటే మురికి కాలువ
- మురికి కాలువలు లేక రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు
- ప్రత్యేక నిధులు కేటాయించాలని గ్రామస్తుల వేడుకోలు
తుంగతుర్తి మార్చి 16 : జిల్లాలోని నాగారం మండల పరిధిలోని లక్ష్మాపురం గ్రామంలో గత 50 సంవత్సరాలుగా మురికి కాలువలు లేక గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. ఉమ్మడి పసునూరు గ్రామంగా లక్ష్మాపురం ఉన్నప్పుడు ఏఒక్క నాయకుడు పట్టించుకుని ఈ ఊర్లో మురికి కాలువ నిర్మించిన పాపాన పోలేదు. లక్ష్మాపురం గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుండి గత ఐదేళ్ల నుంచి కూడా ఒక మురికి కాలువ నిర్మించలేదు.
దీంతో లక్ష్మాపురం పరిశుభ్రతలో అధ్వానం అంటూ గ్రామస్తులు తమ మనసులో మాటలు బయటపెడుతున్నారు. గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉండి 620 ఓటర్లు 8 వార్డులు సుమారు 200 కుటుంబాలు ఉన్నాయి. ఊర్లో చిన్న పెద్ద కలిపి 15 బజార్లు ఉంటాయి.ప్రతి వీధికి ఇరువైపులా మురికి కాలువలు ఉండాలి కానీ లక్ష్మాపురం గ్రామంలో ఏ ఒక్క వీధికి కూడా మురికి కాలువలు లేవు.
తప్పని అవస్థలు..
ఊర్లో ప్రధాన రహదారికి ఆనుకొని 400 మీటర్ల దూరం వరకు ఒకే ఒక మురికి కాలువ, అధీను ఒక వైపు మాత్రమే ఉన్నది. ఈ ప్రధాన మురికి కాలువ నుండి వచ్చే మురుగు నీరు సైతం ప్రజల ఇళ్ల స్థలాలకు వెళ్లడంతో, నీరు నిలిచి, దోమలతో వాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వస్తే డ్రైనేజీ కాల్వలు లేకపోవడంతో, వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపైనే నిలిచి, రోడ్లన్నీ బురదమయంగా మారడంతో దోమల వ్యాప్తి చెంది మురికి నీటి వాసన వల్ల స్థానికులు, ముఖ్యంగా వృద్ధులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈసారైనా మురుగు కాలువలు నిర్మించేనా..?
నూతనంగా పాలకవర్గం ఏర్పడడంతో ఈసారైనా గ్రామంలో మురుగు కాలువలు నిర్మించే నా అని గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడంతో మొదటి ప్రాధాన్యతగా మురికి కాలువలు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నిధులు మంజూరు చేయాలి
గడిచిన 50 సంవత్సరాల్లో, గ్రామంలో ఒకే ఒక యూనిట్ డ్రైనేజీ నిర్మాణం ఉన్నది. తప్ప ఇప్పటివరకు గ్రామంలో కొత్త అధికారులతో పాటు, పాలకులు వస్తూ ఉన్నారు తప్ప, నూతన డ్రైనేజీ పనుల కోసం నిధులు రాలేదు. నూతన డ్రైనేజీల కోసం ప్రత్యేక నిధులు అవసరం ఉంది, కాబట్టి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించాలి.
లింగయ్య, వార్డు మెంబర్, లక్ష్మాపురం




