30 March, 2026 | 1:50 AM

మునగనూర్‌లో ‘భూ’ బాగోతం

30-03-2026 12:00 AM
  1. రూ. 3 కోట్ల ప్రభుత్వ స్థలం కబ్జా!
  2. ఎమ్మెల్యే వేయించిన బోర్డు మాయం.. రాత్రికి రాత్రే నిర్మాణాలు

అబ్దుల్లాపూర్‌మెట్, మార్చి 29: ప్రభుత్వ భూమిని రక్షించాల్సిన అధికారులే చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే, కబ్జాదారులు ఆకాశమే హద్దుగా రెచ్చిపోతున్నారు.అబ్దుల్లాపూర్మెట్ మండల పరిధిలోని మునగనూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 44/1లో సుమారు 400 గజాల ప్రభుత్వ స్థలంపై కబ్జాదారుల కన్ను పడింది. బహిరంగ మార్కెట్లో దాదాపు రూ. 3 కోట్ల విలువ చేసే ఈ భూమిని హస్తగతం చేసుకునేందుకు పక్కా ప్లాన్ వేశారు.

అసలేం జరిగింది?

గతంలో ఇదే స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం జరగగా, స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి చొరవ తీసుకుని రెవెన్యూ అధికారులతో మాట్లాడి అక్కడ ‘ప్రభుత్వ భూమి‘ అని సూచిక బోర్డు ఏర్పాటు చేయించారు. అయితే, ప్రస్తుతం ఆ బోర్డును తొలగించిన కబ్జాదారులు, రాత్రికి రాత్రే బోరు వేసి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాణాలను గమనించిన కాలనీవాసులు అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు వచ్చి బోరు వాహనాన్ని సీజ్ చేసి హయత్నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే, ఇది కేవలం ‘చేతులు దులుపుకునే‘ చర్యేనని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోవడం లేదు.కొంతమంది అక్రమంగా కంచెలు (ఫెన్సింగ్) ఏర్పాటు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల మౌనం వెనుక కబ్జాదారుల నుంచి అందిన భారీ ‘తాయిలాలు‘ ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఎమ్మెల్యే పేరు చెడగొడితే ఊరుకోం

గతంలో ఎమ్మెల్యే  స్పందించి భూమిని కాపాడారు. కానీ ఇప్పుడు అధికారుల తీరు వల్ల కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి‘ అని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.