భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్
కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): వచ్చే నెలలో చేపట్టనున్న భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం.డేవిడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో మండల సర్వేయర్లు, లైసెన్సుడు సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ... వచ్చే నెలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని 70 గ్రామాలలో సర్వే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భూ సమస్యలు, భూ వివాదాలు లేకుండా పారదర్శకంగా సర్వే నిర్వహించాలని, ఈ సర్వేను ఆధునిక, సాంకేతిక పద్ధతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. డి జి పి ఎస్, రూవర్స్ జి ఐ ఎస్, క్యూ జి ఐ ఎస్ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరుగుతుందని, సర్వేయర్లు, లైసెన్సుడు సర్వేయర్లు సాంకేతిక వినియోగంపై పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తెలిపారు. సర్వే పూర్తి అయిన అనంతరం భూదార్ కార్డులు ప్రభుత్వం జారీ చేస్తుందని, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎలాంటి పొరపాట్లు లేకుండా సర్వే చేపట్టాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్వే ల్యాండ్ రికార్డ్ అధికారి వినయ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్లు, మండల సర్వేయర్లు, లైసెన్చుడు సర్వేయర్లు పాల్గొన్నారు.






