7 July, 2026 | 2:41 AM

మనిషిక్కడ.. మనసక్కడ

07-07-2026 02:01 AM

స్వరాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధంగా 1,369 మంది ఏపీ ఉద్యోగులు

2021 లో దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి నిరీక్షణ

  1. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు
  2. అయినా.. తెలంగాణ, ఆంధ్రా మధ్య వీడని బదిలీల లంకె
  3. తెలంగాణ ప్రభుత్వం చొరవతో ఏపీ నుంచి స్వరాష్ట్రానికి 2,300 మంది
  4. ఏపీ ప్రభుత్వం చొరవ చూపకపోవడంపై ఉద్యోగుల పెదవి విరుపు
  5. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ డిమాండ్

హైదరాబాద్, జూలై ౬ (విజయక్రాంతి): ఆంధ్రప్రదేశ్  స్థానికత కలిగి తెలంగాణలో స్థానికేతరులుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ఉమ్మ డి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడుస్తున్నా వారు కుటుంబాలకు, ఆప్తులకు దూరంగా ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చిం ది. మనసు ఆంధ్రాలో ఉన్నా కేవలం ఉద్యోగం కోసం మనిషి ఇక్కడే ఉంటూ మానసిక ఆవేదన అనుభవిస్తున్నారు. నే డో రేపో తమ సొంత రాష్ట్రానికి వెళ్తామనే ఆశతో 2014 నుంచి వారు ఎదురుచూస్తున్నారు.

ఈ కాలంలో రెండు రాష్ట్రాల్లో నూ ప్రభుత్వాలు మారినా వారి బదిలీల సమస్య మాత్రం పరిష్కారానికి నోచుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వీరిని పంపించడానికి సుముఖంగానే ఉన్నా ఏపీ ప్రభు త్వం మాత్రం తమను సొంత రాష్ర్టంలోకి తీసుకునేందుకు అలసత్వం ప్రదర్శిస్తోందని నాన్‌లోకల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (ఎన్‌ఎల్టీఏ) నాయకులు ఆరోపిస్తున్నారు. తమను ఎప్పుడు స్వరాష్ట్రానికి పంపిస్తారో చెప్పాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యోగుల విభజన ప్రక్రియ దాదాపు పూర్తయినప్పటికీ, ఇంకా కొద్దిమంది మాత్రమే ఇరు రాష్ట్రా ల్లో మిగిలిపోయారు. గతంలో తెలంగాణలో ఉన్న ఏపీ ఉద్యోగులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు, అలాగే అక్కడ ఉన్న తెలంగాణ ఉద్యోగులు ఇక్కడికి వచ్చేందుకు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏపీ నుంచి తెలంగాణకు వచ్చేందుకు 1,808 మంది దర ఖాస్తు చేసుకోగా, తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు 1,369 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

తెలంగాణ తీసుకున్నప్పుడు మరి ఏపీ?

రెండు ప్రభుత్వాలు ఎన్వోసీలు జారీ చేసుకున్న సమయంలో భద్రాచలం ముంపు గ్రామాల విలీనంతో కొందరు ఉద్యోగులు ఏపీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం గత 12 ఏళ్లలో జీవో నెంబర్ 130 ద్వారా 1,588 మందిని, జీవో నెంబర్ 37 ద్వారా 727 మందిని, జీవో నెంబర్ 142 ద్వారా 160 మందిని ఆంధ్రా నుంచి తమ రాష్ట్రానికి తీసుకుంది. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరో 60 నుంచి 70 మంది వరకు తెలంగాణకు తీసుకున్నారు. 

ఇలా ఇప్పటివరకు సుమారు 2,300 మంది ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రా నుంచి బదిలీ చేసుకుంది. గత జూన్‌లో మరో 891 మందిని తెలంగాణకు పంపేందుకు ఏపీ ప్రభుత్వం జాబితా పంపింది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు ఒక్క ఆంధ్రా ఉద్యోగినైనా తెలంగాణ నుంచి తిరిగి తీసుకోలేదు.

తెలంగాణ ప్రభుత్వం తమ వారిని తీసుకుంటున్నప్పుడు, ఏపీ ప్రభుత్వం తమను ఎందుకు తీసుకోవడం లేదని 1,369 మంది బాధిత ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపితేనే ఈ సమస్యకు ముగింపు లభిస్తుందని ఆకాంక్షిస్తున్నారు. ఏపీ నుంచి ఉద్యోగులను తాము తీసుకుంటున్నందున, తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులను కూడా తిరిగి తీసుకోవాలని ఏపీ సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం ఒక అధికారిక లేఖ రాయాలని వేడుకుంటున్నారు. పరస్పర అంగీకారంతో వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకునేలా ఇరు రాష్ట్రాలు అడుగులు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఏపీ ప్రభుత్వం ఏ ఒక్క ఉద్యోగినీ తీసుకోలేదు

తెలంగాణ ప్రభుత్వం తమ ఉద్యోగులను దాదాపు 2300 మందిని తీసుకున్నది. మళ్లీప్పుడు మరో 891 మందిని తీసుకునేందుకు చర్యలు చేపట్టింది. కానీ 12 ఏళ్లుగా ఇంత వరకూ ఏపీ స్థానికత ఉండి తెలంగాణలో విధులు నిర్వర్తిస్తున్న మమ్మల్ని ఏపీ సర్కారు తీసుకోలేదు. మమ్మల్ని మా సొంత రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ లెటర్ రాసి 12 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యను ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

 ఎం.మోహనరావు, ఎన్‌ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు

ఏపీ ప్రభుత్వం తీసుకోవడంలేదు

మా ప్రభుత్వం మమ్మల్ని తీసుకోవడంలేదు. క్యాడర్ ప్రకారమే చూస్తున్నది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేందుకు దాదాపు ఏడెనిమిది శాఖలకు చెందిన ఉద్యోగులుంటే, ఏపీ నుంచి ఇక్కడికి వచ్చేవారిలో 40 50 శాఖలకు చెందిన వాళ్లున్నారు. ఇది పెద్ద సమస్యగా పరిణమించింది.

వన్‌టైం సెటిల్‌మెంట్ చేసుకునేలా రెండు ప్రభుత్వాలు అంగీకారం తెలపాలి. మేం ఇక్కడే ఉండిపోవడంతో రిజర్వేషన్లు, మానవీయ సంబంధాలు కోల్పోతున్నాం. హెల్త్ కార్డులు సైతం పనిచేయడంలేదు. కుటుంబాలకు, ఆప్తులకు దూరంగా ఉంటున్నాం. మేం ఏపీకి వెళ్లేలా రెండు ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి.

 వి.సూర్యనారాయణ, ఎన్‌ఎల్టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి