8 March, 2026 | 1:44 AM

‘ఆమె’ కలలకు రెక్కలిద్దాం !

08-03-2026 12:01 AM

చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు స్త్రీని గౌరవించే సంస్కారం నేర్పాలి. రక్షణ పేరుతోఆడపిల్లలకు ఆంక్షలు విధించకూడదు. వారిని ధైర్యవంతులుగా తీర్చిది ద్దాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఈ ప్రతిజ్ఞ చేద్దాం. వారు పడిపోతున్నప్పుడు చేయూతనిద్దాం. 

నేటి మహిళ కేవలం భూమిపైనే కా దు, ఆకాశంలో కూడా సత్తా చాటుతున్నది. గృహిణి నుంచి వ్యోమగామి వరకు అన్ని రంగాల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నది. అంతరిక్ష రహస్యాలను ఆమె ఛేదిస్తోంది. వంటింటి గడప దాటడమే సాహసమని భావించిన రోజులు అప్పట్లో ఉండేవి. ఇప్పు డు మహిళలు దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. కార్పొరేట్ సంస్థలను శాసించే అధినేతలుగా ఎదుగుతున్నారు.

వారి ప్రయాణం అత్యంత స్ఫూర్తిదాయకం. గత కొన్నేళ్లుగా మహిళా సాధికారత విషయంలో ఎన్నో మార్పులు వచ్చాయి. సైన్స్, టెక్నాలజీ, క్రీడలు, రాజకీయాలలో కూడా ఆమె తన ముద్ర వేస్తోంది. లింగ సమానత్వం అనేది ఇప్పుడు ఒక ఆవశ్యకతగా మారింది. అంతటి శక్తి ఉన్న మహిళల సేవలను, కృషిని కొనియాడేందుకే యేటా మార్చి 8వ తేదీన ప్రపంచమంతా మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది.

ఇది మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటానికి గుర్తు. 1908లో అమెరికాలో మహిళా కార్మికులు తమ హ క్కుల కోసం ఉద్యమించారు. సమాన వేత నం, పని సమయం తగ్గింపు వారి ప్రధాన డిమాండ్లు. ఆ ఉద్యమం మహిళా దినోత్సవానికి పునాది వేసింది. నేడు మహిళా సాధికారత ఒక సామాజిక చైతన్య ప్రవాహంగా మారింది. శతాబ్దాల కట్టుబాట్ల సంకె ళ్లను ఆమె తెంచుకుంది. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంది.

వారి గౌరవాన్ని కాపాడాలి

మహిళా దినోత్సవం కేవలం ఒక రోజుకు పరిమితం కాకూడదు. ఆమె త్యాగాలను ప్రతి నిత్యం గుర్తు చేసుకోవాలి. మహిళ గొప్పతనాన్ని గుర్తించాలి. ఆమె గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. కృతజ్ఞత లేని జీవితం విలువలేనిది. మహిళల కష్టాన్ని గుర్తించని సమాజం అభివృద్ధి చెందదు. ఆమెను గౌరవించడం మన కర్తవ్యం. ఆమె ను ప్రోత్సహించడం మన బాధ్యత. భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తి స్వరూపిణిగా పూజిస్తారు. ఆ పూజ గర్భగుడికే పరిమితం కాకూడదు. పొలంలో చెమట చిందించే కూలీలో ఆమె ఉన్నారు. దేశ సరిహద్దులో గస్తీ కాసే వాళ్లలో సైనికురాళ్లు ఉన్నారు.

రో బోటిక్స్ పరిశోధన చేసే శాస్త్రవేత్తల్లో మహిళలున్నారు. ఆటో నడిపి కుటుంబాన్ని పోషిం చే ఇల్లాలిలో ఆమె కృషి ఉంది. దేశ జీడీపీలో మహిళల శ్రమ వెలకట్టలేనిది. సమా జం మహిళకు ఇచ్చే గౌరవం మాటల్లో ఎక్కువగా ఉంటోంది. ఆచరణలో అది చాలా త క్కువ. పెదవులపై గౌరవం కనిపిస్తోంది. చేత ల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. అమ్మాయి పుట్టినప్పుడు కొందరు ఆందోళన చెందుతారు. కానీ అదే అమ్మాయి ఎదిగి కుటుంబానికి ఆధారం అవుతుంది. అప్పుడు ఆమె విలువ అందరికీ తెలుస్తుంది. చెట్టు ఉన్నప్పుడు నీడ విలువ తెలియదు.

కోసిన తర్వాత అందరికీ దాని విలువ తెలుస్తుంది. మహిళ తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం జీవిస్తుంది. పెళ్లి అయిన తర్వాత భర్త కోసం జీవిస్తుంది. పిల్లలు పుట్టిన తర్వాత వారి కోసం బతుకుతుంది. చివరకు తన కోసం జీవించడానికి ఆమెకు సమయం ఉండదు. దీపం తన కోసం కాదు, ఇతరుల కోసం వెలుగుతుంది. మహిళ జీవితం కూడా అలాగే ఉంటుంది.

ఇంటిపనిలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి

మహిళ తన కలలను మౌనంగా త్యాగం చేస్తుంది. తన ఆశలను హృదయంలో దా చుకుంటుంది. ఇతరుల సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటుంది. ఇదే మహిళ గొప్పతనం. ప్రతిఫలంగా ఆమె ప్రేమ, గౌరవం కోరుతుంది. మహిళను బలహీనురాలిగా చూడకూడదు. ఆమెను ఒక శక్తిగా చూడాలి. ఆమె ఒక జీవాన్ని సృష్టించగలదు. ఒక కుటుంబాన్ని నిర్మించగలదు. ఒక సమాజాన్ని మార్చగలదు. తల్లిగా ప్రేమను ఇస్తుంది.

భార్యగా తోడుగా ఉంటుంది. చెల్లిగా అనురాగాన్ని పంచేది ఆమె. కూతురిగా ఆనందాన్ని ఇస్తుంది. ఆడది ఉన్న ఇల్లు ఆనందం ఉన్న ఇల్లు. ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక తల్లి ఉంటుంది. తల్లి బిడ్డకు జీవితం ఎలా గడపాలో నేర్పుతుంది. విత్తనం చిన్నదైనా చెట్టు పెద్దదవుతుంది. తల్లి ఇచ్చిన చిన్న విలువలు జీవితంలో గొప్ప విజయాలకు దారి తీస్తాయి. తాజాగా దేశీయ గణాంకాల ప్రకారం మహిళా అక్షరాస్యత పెరుగుతోంది.

ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం మెరుగుపడుతున్నది. కానీ, కేవలం నంబర్ల పెరుగుదల సా ధికారత కాదు. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉండాలి. పెళ్లి, చదువు, కెరీర్ ఏదైనా నిర్ణయం ఆమెదే కావాలి. సమాజం కేవలం సలహాదారుగా ఉండాలి. శాసనకర్తగా మారకూడదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. ఇల్లు కూడా మహిళలకు సురక్షితమైన ప్రదేశం అని చెప్పలే ము. డిజిటల్ యుగంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆఫీసులో రాణిస్తూనే, ఇంట్లో బాధ్యతలు నెరవేర్చడంలో ఆమె ఒత్తిడికి లోనవుతున్నది.

ఇంటి పనిలో పురుషుల భాగస్వామ్యం పెరగాలి. సమానత్వం అనేది ఇంటి నుంచే మొదలవ్వాలి. ఆమె కలలను నిజం చేసుకునే క్రమం లో అందరూ అండగా నిలవాలి. స్త్రీ శక్తికి అడ్డుకట్ట వేయకూడదు. ఆకాశమంత అవకాశాలను కల్పిద్దాం.

మహిళా సాధికారత సాధించిన రోజే నిజమైన వికాసం సాధ్యం. చట్టాలు చేస్తే సరిపోదు. సామాజిక దృక్ప థం మారాలి. చిన్నప్పటి నుంచే అబ్బాయిలకు స్త్రీని గౌరవించే సంస్కారం నేర్పాలి. రక్షణ పేరుతోఆడపిల్లలకు ఆంక్షలు విధించకూడదు. వారిని ధైర్యవంతులుగా తీర్చిది ద్దాలి. మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. వారు పడిపోతున్నప్పుడు చేయూతనిద్దాం. వారి కలలకు రెక్కలొచ్చేలా సహకరిద్దాం. 

        సెల్: 84668 27166