30 June, 2026 | 12:39 AM

ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ

29-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 28: ప్రస్తుతం జీవిత బీమా వ్యాపారం చేస్తున్న ప్రభుత్వ రంగ దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇకమీదట ఆరోగ్య బీమా రంగంలో ప్రవేశించాలని ప్రయత్నిస్తున్నది. ఈ రంగంలో కార్యకలాపాలు నిర్వహి స్తున్న కంపెనీల్లో టేకోవర్ చేయదగ్గ అవకాశాలను అన్వేషిస్తున్నామని ఎల్‌ఐసీ చైర్మన్ సిద్ధార్థ్ మొహంతి వెల్లడించారు ఆరోగ్య బీమా రంగంలోకి కాంపోజిట్ బీమా కంపెనీలను ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ అనుమతించనున్న నేపథ్యంలో ఈ దిశగా ఎల్‌ఐసీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీమా చట్టం 1938, ఐఆర్‌డీఏఐ నియంత్రణల ప్రకారం ఒకే సంస్థ లైఫ్, జనరల్ లేదా హెల్త్ ఇన్సూరెన్స్ కార్యకలాపాల్ని నిర్వహించడానికి కాంపోజిట్ లైసెన్సులు ఇవ్వకూడదు. త్వరలో ఆ చట్టాన్ని సవరించి, కాంపోజిట్ లైసెన్సుల్ని మంజూరు చేస్తారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇన్సూరెన్స్ కంపెనీల వ్యయాల్ని, రెగ్యులేటరీ భారాన్ని తగ్గించేందుకు కాంపోజిట్ ఇన్సూరెన్స్ లైసెన్సులు అమలు చేయాలని 2024 ఫిబ్రవరిలో పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.