30 June, 2026 | 1:36 AM

ఆర్బీఐ నుంచి మూడు ఆవిష్కరణలు

29-05-2024 12:05 AM

ముంబై, మే 28: లైసెన్సులు, అనుమతుల ప్రక్రియను సరళతరం చేసేలా, రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు ఊతమిచ్చేలా రిజర్వ్‌బ్యాంక్ మంగళవారం మూడు కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టింది. అవి.. ప్రవాహ్ పోర్టల్, ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ మొబైల్ అప్లికేషన్, ఫిన్‌టెక్ రిపాజిటరీ. ఈ మూడింటిని ప్రారంభించనున్నట్టు ఆర్బీఐ గతంలోనే ప్రకటించింది. ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తల సమక్షంలో రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ వీటిని ఆరంభించారు. ఆర్బీఐ విడుదల చేసిన ప్రకటన వివరాలు..

ఫిన్‌టెక్ రిపాజిటరీ

భారత్‌లోని ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలకు చెందిన సమగ్ర డేటాను  ఫిన్‌టెక్ రిపాజిటరీ అందిస్తుందని ఆర్బీఐ తెలిపింది. రెగ్యులేషన్స్‌ను అవగాహన్ చేసుకోవడానికి, పాలసీ రూపకల్పనకు వీలు కల్పిస్తుందన్నది. ఇదేవిధంగా ఆర్బీఐ నియంత్రణలోని బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు అవలంబిస్తున్న కొత్త టెక్నాలజీలపై (ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, డీఎల్‌టీ, క్వాంటమ్ తదితరాలు) ఎమ్‌టెక్ రిపాజిటరీను కూడా త్వరలో తీసుకురానున్నట్టు కేంద్ర బ్యాంక్ తెలిపింది.