29 June, 2026 | 11:28 PM

మార్కెట్‌కు మళ్లీ ఎలక్షన్ టెన్షన్

29-05-2024 12:05 AM

న్యూఢిల్లీ, మే 28:  కొద్దిరోజులపాటు రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్ లోక్‌సభ ఎగ్జిట్ పోల్స్ వెలువడే సమయం దగ్గరపడుతున్న కారణంగా తిరిగి అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నది. వరుసగా మూడవ రోజైన మంగళవారం సైతం స్టాక్ సూచీలు నష్టాలతో ముగిసాయి. పరిమితశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన  బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు 220 పాయింట్ల నష్టంతో 75,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 22,900 దిగువన 22,888 పాయింట్ల వద్ద నిలిచింది. రెండు సూచీలు పాజిటివ్‌గా మొదలైనప్పటికీ, నష్టాలతో ముగిసాయి. సోమవారం కూడా కొత్త రికార్డుస్థాయిల్ని నెలకొల్పిన తర్వాత చివరకు క్షీణించిన సంగతి తెలిసిందే. 

ఒడిదుడుకులు పెరుగుతాయ్

ఎన్నికల ఫలితాల సమయం దగ్గరపడుతున్నందున మార్కెట్లో ఒడిదుడుకులు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మంగళవారం వరుసగా మూడో రోజూ నిఫ్టీ నష్టాలతో ముగిసిందని, ఎన్నికల ఫలితాలు వెలువడేముందు ఇన్వెస్టర్లలో టెన్షన్ పెరుగుతున్నట్టు ట్రేడింగ్ ట్రెండ్‌లో కన్పిస్తున్నదని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని తెలిపారు. అనిశ్చితి సమయాల్లో రక్షణాత్మక రంగాలుగా పరిగణించే ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు మెరుగ్గా ట్రేడ్ అవుతుండగా, మిడ్, స్మాల్‌క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయన్నారు. అలాగే ట్రేడింగ్ పరిమాణం తగ్గుతున్నదన్నారు.