16 July, 2026 | 12:11 PM

మంత్రిగారి అక్షరాభ్యాసం!

20-06-2024 01:21 AM

న్యూఢిల్లీ, జూన్ 19: ఈసారి లోక్‌సభకు ఎక్కువ మంది విద్యావంతులే ఎన్నికయ్యారని ఒకవైపు నివేదికలు వెలువడుతుండగా.. సాక్షాత్తూ ఓ కేంద్ర మంత్రి నాలుగు అక్షరాలు సరిగ్గా రాయలేక నవ్వుల పాలయ్యారు. దేశంలో బాలిక విద్యను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ‘బేటీ బచావో. బేటీ పడావో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నినాదాన్ని బీజేపీ నేతలు విపరీతంగా ప్రచారం చేశారు. తాజాగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ ఈ నినాదాన్ని తప్పులు లేకుండా రాయలేకపోయారు. ఆమె మధ్యప్రదేశ్‌లోని ధర్ లోక్‌సభ స్థానం నుంచి ఇటీవల గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. దీంతో బుధవారం ధర్ పరిధిలోని బ్రహ్మకుండ్‌లో ఉన్న పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. క్లాస్‌రూంలోకి వెళ్లి బ్లాక్‌బోర్డుపై హిందీలో బేటీ బచావో.. బేటీ సడావో నినాదాన్ని రాశారు. కానీ, తప్పుల తడకగా రాశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. పిల్లల మంత్రికి పిల్లల నినాదం కూడా రాయరాలేదంటూ నెటిజన్లు జోకులు వేస్తున్నారు.