16 July, 2026 | 2:01 AM

బనకచర్లపై ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

16-07-2026 01:59 AM
  1.   28రోజుల్లోపు హాజరు కావాలని ఆదేశం
  2. ప్రతివాదులు హాజరుకాకుంటే చట్టప్రకారం తీర్పు

న్యూఢిల్లీ, జూలై 15: పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును నిలిపివేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు 13 మంది ప్రతివాదులకు సమన్లు జారీ చేస్తూ, సమన్లు అందిన తేదీ నుంచి 28 రోజుల్లోపు కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం డీపీఆర్ తయారీ, ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ముందుకు సాగకుండా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

తెలంగాణ ప్రభుత్వం 2026 ఏప్రిల్ 25న రాజ్యాంగంలోని ఆర్టికల్131 కింద ఒరిజినల్ సూట్ నం.1/2026ను దాఖలు చేసింది. ఇందులో పోలవరం ప్రాజెక్టును నిలిపివేయడంతో పాటు, ఏపీ ప్రభుత్వం చేపడుతున్న తదుపరి చర్యలను అడ్డుకోవాలని కోరింది. ప్రధాన దావాతో పాటు తా త్కాలిక నిషేధాజ్ఞ (ఇంటరిమ్ ఇంజంక్షన్) మంజూరు చేయాలని కూడా ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్, తాత్కాలిక నిషేధాజ్ఞ దరఖాస్తు ప్రతులను ప్రతివాదులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

అలాగే, నిర్ణీత గడువులోపు అడ్వకేట్-ఆన్-రికార్డ్ ద్వారా కోర్టులో హాజరై తమ వాదనలు వినిపించాలని సూచించింది. విచారణ రోజున తమ న్యాయవాదులతో పాటు కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలు, అవసరమైతే సాక్షులను కూడా సిద్ధంగా ఉంచాలని సమన్లలో స్పష్టం చేసింది. జూలై 13, 2026న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ సమన్లు జారీ అయ్యాయి.

నిబంధనల ప్రకారం అవసరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత కేసును విచారణకు జాబితా చేయనున్నట్లు కోర్టు తెలిపింది. అలాగే, నిర్ణీత గడువులోపు ప్రతివాదులు హాజరు కాకపోతే, వారి గైర్హాజరులోనే కేసును విచారించి చట్టప్రకారం తీర్పు ఇవ్వవచ్చని సుప్రీంకోర్టు సమన్లలో హెచ్చరించింది. పోలవరం ప్రాజెక్టు అంశంపై సుప్రీంకోర్టు చేపట్టి న ఈ చర్య రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు.