కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్
జిల్లా వ్యాప్తంగా 9 బెంచ్ లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ..
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలతో నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్(District Legal Services Authority Chairman Patil Vasant) అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్షణికావేశంలో చేసిన తప్పులను పెద్దమనసుతో క్షమించి రాజీమార్గంలో పయనించాలని ఆయన సూచించారు. సమాజ సుఖశాంతులకు రాజీమార్గమే ఉత్తమమని న్యాయమూర్తి అన్నారు.
కలహిస్తున్న కక్షిదారుల ముఖాలపై చిరునవ్వు చూడడమే లోక్ అదాలత్ ధ్యేయమని స్పష్టం చేశారు. కలహాలు లేని సమాజమే అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ కలహాలను విడనాడి తమ యొక్క కేసులను సామరస్యంగ రాజీమార్గం ద్వారా జాతీయ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు, సమయం ఆధాతో పాటు ఇరువురు స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతారన్నారు. ఇంట్లో భార్యాభర్తలు చిన్న చిన్న సమస్యలను అక్కడే పరిష్కరించుకోవాలని కోర్టు మెట్ల వరకు రావద్దని తెలిపారు. కోర్టు కేసుల సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అందుకు జాతీయలో లోక్ అదాలత్ మంచి వేదిక అని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ తెలిపారు.
కక్షిదారులకు మధ్యాహ్నం పులిహార,మంచినీటి సదుపాయాన్ని కల్పించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె. కిరణ్ కుమార్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సాయి శ్రీ, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రవికుమార్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ మెండు రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, చీప్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ వి. పురుషోత్తం రావు, డిప్యూటీ కౌన్సిల్ పి.నిరంజన్ రావు న్యాయవాదులు పాల్గొన్నారు. మెంబర్లుగ ఎ. పార్వతి, పి. విటల్, జి. రామచంద్రారెడ్డి, ఎన్ ప్రతిభ, వై. యుగంధర్ నాయుడు వ్యవహరించారు.






