డబుల్ బెడ్‌రూం కోసం ఎదురుచూపు
తాత్కలికంగా నివాసముంటున్న మల్లన్నసాగర్ ముంపు బాధితులు
ప్లాట్లు, ఇండ్లు చూపితేగాని వెళ్లమంటున్న ముంపు బాధితులు
13 నెలలుగా రూ. 60లక్షలకు పైగా విద్యుత్ బకాయిలు
సమస్యలతో పెనవేసుకున్న గజ్వేల్ డబుల్‌బెడ్‌రూం ఇండ్ల పంపిణీ
ఎదురుచూపులకే పరిమితమవుతున్న నిరుపేదలు
గజ్వేల్, మే 15: డబుల్ బెడ్‌రూం ఇండ్లతో తమ అద్దె ఇండ్ల కష్టాలు తొలగిపోతాయంటూ ఆశల పల్లకిలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లోని ఇండ్లులేని పేదలు ఎదురుచూస్తున్నారు. ఆరేండ్లు గడిచిన ఇండ్లను పేదల కోసం నిర్మించిన ఇండ్లు పంపిణీ చేయకపోగా, వాటిలో మల్లన్నసాగర్ ముంపు బాధితులు నాలుగేండ్లుగా నివాసం ఉండటంతో శిథిలావస్థకు కూడా చేరుకుంటున్నాయి. ఇండ్ల నిర్మాణం పూర్తయి రెండుసార్లు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగినా ఆ ఇండ్లనే ఆశచూపి ఓట్లు దండుకోవడం జరిగిందే తప్ప ఇండ్లు అప్పగించిన దాఖలాలు లేవు. వాటి కోసం ధర్నాలు చేస్తున్నా అధికారులు సర్దిచెప్పడమే తప్ప ఇండ్ల పంపిణీ చేయటంలేదు.
పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం కేసీఆర్ సంగాపూర్‌లో 1,200 డబుల్‌బెడ్‌రూం ఇండ్లు జీ ప్లన్ వన్ పద్ధతిలో నిర్మించారు. వీటిలో వంద ఇండ్లు కోటమైసమ్మ రహదారి, క్యాసారం రహదారి విస్తరణలో పూర్తిగా ఇండ్లు కోల్పోయిన వారికి అందజేశారు. మిగతా 1,100 ఇండ్ల పంపిణీ కోసం 1,350మంది అర్హులను ఎంపిక చేసి డ్రా ద్వారా 1,100ల మందిని ఎంపిక చేశారు. వారికి నంబర్లు కూడా ఇచ్చారు. దీనిలో పలువురు ఇండ్లకు తాళా లు కూడా వేసుకున్నారు. అయితే 2020 నుంచి మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలను అధికారులు ఈ ఇండ్లలో ఉంచారు. ప్యాకేజీలు అందిన వారు ఒక్కొక్కరుగా ఇండ్లు ఖాళీ చేసి వెళ్లారు. ప్రస్తుతం 1,100 ఇండ్లలో ఇంకా ముంపుబాధితులు నివాసం ఉంటున్నారు. తమ ప్యాకేజీలు ఇస్తేనే ఖాళీ చేస్తామంటున్నారు.
పరిహారంతో ముడిపడ్డ పంపిణీ
ముంపు బాధితులకు ప్లాట్లు, ప్యాకేజీలు పూర్తిగా అందకపోవడంతో వారు ఇబ్బందిపడుతూనే ఈ ఇండ్లలో నివాసం ఉంటు న్నారు. తమతోటి వారికి ప్యాకేజీలు, ప్లాట్లు రావడంతో వారంతా ఇండ్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని, తమకు కూడా ఇస్తే తామూ వెళ్లిపోయి ఇండ్లు నిర్మించుకుంటామంటున్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల బాధి తులు ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో అధికారులు స్పందించి ముంపు గ్రామాల ప్రజలకు పరిహారం వచ్చినవారిని గుర్తించి ఖాళీ చేయించారు. అయినా చాలా వరకు పరిహారం, ప్లాట్లు రానివారే నివాసం ఉండడాన్ని గుర్తించి ఉన్నతాధికారులకు రిపోర్టు చేశారు. రెండుసార్లు ఎన్నికలు పూర్తయినా తమకు ఇండ్లు పంపిణీ చేయకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్ వద్దకు లబ్ధిదారులు వెళ్లి తమ గోడు చెప్పుకోవడానికి వెళ్లారు.
మరోసారి పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌రావును అడుగగా వెం టనే ఆయన ఆర్డీవో కార్యాలయానికి లబ్ధిదారులతో కలిసి వెళ్లి వారంలోగా ఇండ్లు పంపి ణీ చేయాలని చెప్పారు. అధికారులు అందు కు సానుకూలంగా స్పందించినా ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. అయితే గత 13 నెలల నుంచి డబుల్ బెడ్‌రూం ఇండ్ల బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.60లక్షలకు పైగా విద్యుత్ బిల్లులు బకాయి ఉన్నట్లు తెలుస్తుంది. విద్యుత్ బకాయలు పెరిగిపోవడంతో ఆ శాఖ అధికారులు తలలు పట్టుకుంటుండగా, నిధులు లేకపోవడం వల్లే ఈ విద్యుత్ బకాయలు చెల్లించలేదని పలువురు చెప్పుకుంటున్నారు.
ఇప్పటికే ఈ ఇండ్లు చాలావరకు పాడైపోయాయి. గజ్వేల్ ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ ఇన్ని సమస్యలతో పెనవేసుకోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో లబ్ధిదారులంతా ఎప్పుడు ఇండ్ల పంపిణీ జరుగుతుందా అంటూ ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం, అధికారులు గజ్వేల్ పట్టణ ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల పంపిణీ ఏ విధంగా చేయనున్నారో వేచి చూడాలి మరి.




