హౌస్ కమిటీ, సీబీసీఐడీ కాదు.. సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయిద్దాం
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ఎన్నో రాష్ట్రాలు కాపీ కొట్టాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో దళితుల సంక్షేమానికి చేసిన ఖర్చు రూ.1.395 కోట్ల నిధుల మాత్రమే మంజూరు చేసిందని, కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీల సంక్షేమానికి రూ. 7,361 కోట్లుకు పైగా ఖర్చు పెట్టిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కింద కాంగ్రెస్ సర్కార్ రూ.3,267 కోట్లు కేటాయించి, కేవలం రూ.28 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిందని విమర్శించారు.
బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయి కానీ ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి ఖర్చు చేయడానికి మాత్రం పైసలు లేవంట! అని ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీల మీద సీఎం రేవంత్ రెడ్డికి ఉన్నది కపట ప్రేమ అని, మంత్రి కంపెనీ అవినీతికి పాల్పడిందనేది సుస్పష్టం అన్నారు. ఆయన మంత్రి పదవిలో ఉండగా.. దర్యాప్తు పారదర్శకంగా ఎలా జరుగుతుంది..? అని, మంత్రిని కాపాడేందుకే రేవంత్ రెడ్డి సీబీసీఐడీ దర్యాప్తు చేయిస్తామన్నారని ఎద్దేవా చేశారు. ముందుగా ఆరోపణలు ఉన్న మంత్రిని బర్తరఫ్ చేసి దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
ఏ తప్పు చేయకపోతే మంత్రి పొంగులేటి ఎందుకంత భయపడుతున్నాడు?, అక్రమ మైనింగ్ చేస్తున్న మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీని మూసివేయాలని 8 నెలల కిందటే పొల్యూషన్ బోర్డుకు మైనింగ్ శాఖ ఉత్తరం రాసింది. 8 నెలల నుండి చర్యలు తీసుకోకుండా ఈ కాంగ్రెస్ దొంగలు గడ్డిపీకుతున్నారా? లేకపోతే గాడిద పండ్లు తోముతున్నారా? అని ఎమ్మెల్యే విరుచుకుపడ్డారు. అలాగే సీఎం తమ్ముడు, బావమరిదిపై వచ్చన ఆరోపణలపై విచారణకు సిద్ధమా..?, హౌస్ కమిటీ కాదు... నా బావమరిది, తమ్ముడిపై ముఖ్యమంత్రి చేసిన అవినీతి ఆరోపణలపై సిట్టింగ్ జడ్జీతో విచారణకు సిద్దమా..? అని సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్ విసిరారు.




