ప్రతి మొక్కను సంరక్షిస్తాం
హరితహారం జిల్లా లక్ష్యం 27.87లక్షలు
ప్రతి మొక్కను సంరక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ
పాపన్నపేట మే 7 : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు గాను ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఏడాది వర్షాకాలంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటేందుకు గాను ప్రతి గ్రామ పంచాయతీలో ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మొక్కల ఎదుగుదలతో వాటి సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటు న్నారు.
వేసవి కాలంలో ఎండలను తట్టుకునేలా నర్సరీల్లో ప్రత్యేకంగా షేడ్ నెట్‌లను ఏర్పాటు చేసి ప్రతిరోజు వనసేవకుల ద్వారా మొక్కలకు నీటిని అందిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలిక, అటవీశాఖల ఆధ్వర్యం లో ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లతో పాటు గ్రామాల్లోని ప్రజల అభిరుచులకు తగ్గట్టు మొక్కలను సిద్ధం చేయడం జరిగింది. వర్షాలు కురియగానే నర్సరీల్లోని ఎదిగిన మొక్కలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో నాటేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
నాటడమే కాదు సంరక్షణ ముఖ్యమే
గతంలో చేపట్టిన హరితహారం కార్యక్రమాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడం తో కొన్ని ప్రాంతాల్లో కిందిస్థాయి అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడం జరిగిం ది. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలి. క్షేత్రస్థాయిలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించి మొక్కల సంరక్షణ శాతాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది.
అలాగే ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా చెట్లను నాటడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యుత్ స్తంభాల కింద మొక్కలను నాటుతుండటంతో అవి ఏపుగా పెరిగి తీగల వరకు చేరుకుంటున్నాయి. వీటి వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో డిస్కం అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా విద్యుత్ స్తంభాల కింద ఉన్న చెట్లను తొలగిస్తున్నారు. ఇలాంటివి పునారావృతం కాకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం ఉంటుంది.
నాటిన ప్రతి మొక్కకు జియోట్యాగింగ్
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కకు దాని సంరక్షణ వివరాలను తెలుసుకునేందుకు గాను జియోట్యాగింగ్ వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. నాటిన మొక్కలకు రక్షణ కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు మొక్కలు ఎన్ని నాటారు, వాటిలో ఎన్ని పెరుగుతున్నాయనేది తెలుసుకోనున్నారు. ఇందుకు ప్రతి గ్రామ పంచాయతీలో నాటబోయే మొక్కలు లోకేషన్‌కు సంబంధించిన లాంగిట్యూడ్, ల్యాటిట్యూడ్ వివరాలను సైతం తీసుకుంటున్నారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో మొక్కలను సంరక్షించే వారిపై జిల్లా స్థాయి నుంచి నిరంతర పర్యవేక్షణ చేసే వెసులుబాటు ఉండనుంది.
లక్ష్యాన్ని పూర్తిచేస్తాం
హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడంతో పాటు నాటిన ప్రతి మొక్కను సంరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లోని నర్సరీలలో మొత్తం 21.5లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు ప్రారంభం కాగానే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. శ్రీనివాసరావు, డీఆర్డీఓ
శాఖల వారీగా
నిర్ధేశించిన లక్ష్యాలు
1 వ్యవసాయ శాఖ 10,000
2. డీఆర్డీవో 1,80,0000
3. విద్యాశాఖ 5,000
4. అటవీశాఖ 7,00,000
5. ఉద్యానవన శాఖ 50,000
6. పరిశ్రమల శాఖ 20,000
7. నీటి పారుదల శాఖ 20,000
8. వైద్యారోగ్యశాఖ 2,000
9. గనుల శాఖ 20,000
10. మెదక్ మున్సిపాలిటీ 35,000
11. నర్సాపూర్ మున్సిపాలిటీ 25,000
12. రామాయంపేట మున్సిపాలిటీ 25,000
13. తూప్రాన్ మున్సిపాలిటీ 25,000
14. పోలీస్ శాఖ 10,000
15. ఎక్సైజ్ శాఖ 30,000
16. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ 10,000
మొత్తం 27,87,000




