12 నుంచి మహా కుంభమేళా
* ఫిబ్రవరి 26తో ముగింపు
* 45 కోట్ల మంది వస్తారని అంచనా
* ప్రయాగ్‌రాజ్ కేంద్రంగా నిర్వహణ
* రాష్ట్రపతి, పీఎంతో పాటు పలువురికి ఆహ్వానం
ప్రయాగ్‌రాజ్, డిసెంబర్ 31: ప్రపంంచంలోని అతిపెద్ద మతపరమైన వేడుకగా నిర్వహించే మహా కుంభమేళాకు వేళ అయింది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాను ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్(అలాహాబాద్)లో నిర్వహిస్తున్నారు.
గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ ప్రదేశం అయిన ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఈ వేడకను నిర్వహించడానికి యోగీ ఆదిత్యనాథ్ ఆధ్యర్యంలోని యూపీ ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.
హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్‌లో కూడా కుంభమేళాలను నిర్వహిస్తున్నారు. ఈ వేడకకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. సంగమం వద్ద పవిత్ర స్నానం చేయడం వల్ల జనన, మరణ చక్రం నుంచి విముక్తి లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
కుంభమేళా సమగ్ర సమాచారం కోసం ‘మహా కుంభమేళా 2025’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో పర్యాటకులు, యాత్రికుల కోసం ఘాట్‌లు, దేవాలయాలు, ఇతర మతపరమైన ప్రదేశాల వివరాలను అందుబాటు లో ఉంచారు.
మహా కుంభమేళా ముగిసిన తరువాత అర్ధకుంభ్ మేళాను నిర్వహిస్తారు. మహాకుంభమేళాను దేశంలోని నాలుగు ప్రదేశాల్లో నిర్వహిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్. హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని ప్రాంతాల్లో సూర్యుడు వివిధ రాశులలో ప్రవేశించిన సమయాన్ని బట్టి అక్కడ కుంభమేళాను నిర్వహిస్తారు.
ఆయా ప్రదేశాల్లో జరిగే కార్యక్రమాలకు కోట్లలో భక్తులు హాజరయ్యే అవ కాశం ఉండడంతో ప్రభుత్వాలు ఏర్పా ట్లు చేస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఫ్రాన్స్, బ్రిటన్,కెనడా, మారిషస్, ఉగాండా, కెన్యా తదితర దేశాల నుంచి భక్తులు వస్తారని భా విస్తున్నారు. మహాకుంభమేళా జనవరి 13న పౌష్ పూర్ణిమ స్నానంతో ప్రారంభమై ఫిబ్రవరి 26న మహాశివరాత్రితో ముగుస్తుంది.
ఏర్పాట్లు..
మహా కుంభమేళాలో భద్రత కోసం యూపీ ప్రభుత్వం భారీగా పోలీసులను మోహరిస్తున్నది. ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 57 పీఎస్‌లు ఉన్నాయి. 13 తాత్కాలిక పీఎస్‌లు, 23 చెక్‌పోస్టులు, 8 జోన్లు 18 సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
భక్తుల భద్రత కోసం ప్రయాగ్‌రాజ్ వ్యాప్తంగా దాదాపు 10,000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. కుంభమేళాకు దాదాపు 45 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో వారి భద్రత కోసం అండర్ వాటర్ డ్రోన్లను నిఘా కోసం వినియోగిస్తున్నది.
ఈ డ్రోన్లు 100 మీటర్ల నీటి అడుగున, గాలిలోనూ 120 మీటర్ల ఎత్తులో ఉండి ప్రతి అడుగును పరిశీలించి భద్రతను కల్పిస్తున్నారు. యాంటీ డ్రోన్ వ్యవస్థను, హై రిజల్యూషన్ ఆప్టికల్ సెన్సార్లను కూడా ఉపయోగిస్తున్నారు. నదిపై 700 కంటే ఎక్కువ బోట్లను నిఘా కోసం ఉంచుతున్నారు.
డ్రోన్లతో పాటు ఏఐతో అనుసంధానించిన కెమెరాలు, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మహా కుంభమేళాలో ఒక చిన్న లోపం కూడా జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల కోసం దాదాపు 13,000 రైళ్లు నడువనున్నాయని కేంద్రరైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యాత్రికుల కోసం పట్టణమంతా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.
‘మహాకుంభ్’కు రాష్ట్రపతికి ఆహ్వానం
‘మహాకుంభ్ మేళా లో పాల్గొనాల్సిందిగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ప్రముఖులను యూపీ సీఎం ఆహ్వానించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిసిశారు కుంభమేళాకు సంబంధించిన ఆహ్వానపత్రిక అందించారు.
అనంతరం ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్‌కుమార్ సక్సేనాను కుంభమేళాకు ఆహ్వానిం చారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా హాజరవుతున్నారు.
ముఖ్యమైన తేదీలు..
కుంభమేళా సందర్భంగా జరిగే ముఖ్యమైన కార్యక్రమాల వివరాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ వేడుకలో భక్తులు ఆరు పవిత్ర స్నానాలను ఆచరిస్తారు. ఇందులో ముడు రాజస్నానాలు(షాహిస్నాన్), మూడు ఇతర స్నానాలు ఉంటాయి.
* జనవరి13 పౌష్ పూర్ణిమ సందర్భంగా మొదటి రాజస్నానం జరిగి మహాకుంభమేళా ప్రారంభమవుతుంది.
* జనవరి14 మకర సంక్రాంతి (మొదటి షాహీస్నాన్)
* .జనవరి 29 మౌని అమావాస్య (రెండవ షాహీస్నాన్)
* ఫిబ్రవరి 3 వసంత పంచమి (మూడవ షాహీస్నాన్)
* ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ పవిత్ర స్నానం
* ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా రాజస్నానం జరిగి మహాకుంభమేళా ముగుస్తుంది.






