10 July, 2026 | 12:49 AM

సంఘాల గోడ పత్రికలు..

10-07-2026 12:03 AM
  1. విద్యకు చేటు.. వృత్తికి అపహాస్యం!
  2. చేవెళ్ల ఎంఆర్‌సీ భవనంలో ఉపాధ్యాయ సంఘాల వీరంగం
  3. మహనీయుల చిత్రపటాల పక్కనే అసోసియేషన్ల పోస్టర్ల ప్రదర్శన
  4. ప్రభుత్వ ఆస్తులపై ఏడాదంతా ప్రచారం.. అనుమతి ఎవరిచ్చారు?

చేవెళ్ళ, జులై 9 (విజయక్రాంతి): నాలుగు గోడల మధ్య భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు.. సంఘాల మోజులో పడి పొలిటీషియన్ల పోకడలను ప్రదర్శిస్తున్నారు. చేవెళ్లలోని విద్యా వనరుల భవనం ( ఎం ఆర్ సి ) ఇప్పుడు టీచర్స్ అసోసియేషన్ల మినీ వాల్ పోస్టర్స్ ప్రదర్శనశాలగా మారిపోయింది. మీ సంఘమా? మా సంఘమా? మీరా... మేమా... అన్నట్లుగా ఎవరికి వారు ఇష్టారీతిన ప్రభుత్వ కార్యాలయంలోనే పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన గురువులు.. ప్రభుత్వ నియమాలను తుంగలో తొక్కి విద్యా శాఖ ఆఫీసుల్లోనే గ్రూపు రాజకీయాలకు తెరలేపడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజాధనం బీరువాలు.. సంఘాల హోర్డింగులు..

ప్రభుత్వం వేల రూపాయల ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల ఫైళ్లను భద్రపరిచేందుకు సమకూర్చిన బీరువాలను ఈ ఉపాధ్యాయ సంఘాలు తమ సొంత హోర్డింగ్స్గా మార్చేశాయి. ఎవరికి వారు తమ సంఘాల పబ్లిసిటీ కోసం డైరీలు, క్యాలెండర్లు ముద్రిస్తూ, ఏకంగా రాజకీయ నాయకుల చేత వాటిని ఆవిష్కరింపజేస్తూ హల్చల్ చేస్తున్నారు. విద్యా వనరుల భవనానికి వచ్చే సామాన్య ప్రజలు ఆఫీసు గోడలపై, బీరువాలపై ఉన్న ఉపాధ్యాయుల ఫొటోల ప్రదర్శనలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఉద్యోగ భద్రత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయులమన్న మాట మరిచి, ఇలా గ్రూపులుగా ఏర్పడి ప్రదర్శనల్లో పోటీ పడటం విద్యార్థుల బోధనకు భంగం కలిగిస్తోందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

మహనీయుల చిత్రపటాలకు దీటుగా..

చేవెళ్ల ఎంఈఓ కార్యాలయానికి వెళ్లిన ప్రజలకు మొదటి వరుసలో దేశ మహనీయుల చిత్రపటాలు దర్శనమిస్తుంటే.. వాటికి కాస్త కింది భాగంలోనే, అంతర్గత రికార్డులు భద్రపరిచే బీరువాలకు ఉపాధ్యాయ సంఘాల పోస్టర్లు రంగురంగులుగాదర్శనమిస్తున్నాయి. ఎంఈఓ కుర్చీకి కుడి పక్కన ఉన్న మహనీయుల పోస్టర్లను చూసిన ప్రతిసారీ, ఈ అసోసియేషన్ల అనంత ‘సంగమం’ కనిపిస్తూ ఆఫీసు పవిత్రతను దెబ్బతీస్తోంది. ప్రభుత్వ ఆస్తులపై ఏడాది పాటు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి వీరికి పర్మిషన్ ఎవరిచ్చారన్నది ఇప్పుడు విద్యాశాఖలో ప్రశ్నార్థకంగా మారింది.

బోధనలో చూపండి.. ఈ పోటీ తత్వం

డాక్టర్కు మనిషి ప్రాణాలు కాపాడగలిగే శక్తి మాత్రమే ఉంటే.. టీచర్కు మాత్రమే సృష్టిని కాపాడగలిగే అనంత శక్తి ఉంటుంది. ప్రమాదాన్ని పసిగట్టి, సృష్టిని శోధించి, ఆకాశానికి నిచ్చెన వేసి అవనికి వెలుగులిచ్చే అద్భుతాలకు పునాది వేయగల శక్తి ఉపాధ్యాయునికి మాత్రమే ఉందన్న నమ్మకం సమాజంలో ఉంది. సంఘాల ప్రదర్శనల్లో చూపిస్తున్న ఈ పోటీ తత్వాన్ని, భావితరాలకు అందించే విద్యాబోధనలో చూపిస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడతాయని  చేవెళ్ల ప్రాంత ప్రజల ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే వాటిని తొలగిస్తాం: 

ఈ విషయమై చేవెళ్ల మండల విద్యాధికారి  పురం దాస్ను ‘విజయక్రాంతి’ వివరణ అడగగా ఆయన స్పందించారు. ‘నేను ఆఫీసులో లేని సమయంలో వచ్చి ఆ పోస్టర్లు, క్యాలెండర్లు అతికించి వెళ్లారు. ఆఫీస్ ఆవరణలో, ప్రభుత్వ అంతర్గత ఆస్తులపై ఇలాంటివి అతికించకూడదని చెప్పినా వారు వినిపించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవడం లేదు. పైగా ‘మా సంఘం పేరు కనిపించాలి కదా సార్’ అంటూ వాదిస్తున్నారు. ఆఫీసు బీరువాలకు అతికించిన క్యాలెండర్లను, పోస్టర్లను త్వరలోనే పూర్తిగా తొలగిస్తాం‘ అని ఆయన స్పష్టం చేశారు.

ఎంఈఓ పురం దాస్