ఢిల్లీకి తెలంగాణ ఏటీఎం
- ప్రజల సొమ్మును తరలిస్తున్న కాంగ్రెస్
- రాష్ట్రంలో బీజేపీ అధికారమే లక్ష్యం
- దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీదే
- దేశంలో 3 కోట్ల మంది లఖ్‌పతి దీదీలను తయారుచేస్తాం
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా
హైదరాబాద్, జులై 9 (విజయక్రాంతి): ప్రజల సొమ్మును ఢిల్లీకి తరలిస్తూ తెలంగాణను కాంగ్రెస్ అధిష్ఠానానికి ఏటీఎంగా రాష్ట్రంలోని ఆ పార్టీ ప్రభుత్వం మార్చిందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు. గురువా రం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ప్రజాస్వామ్యం-దౌత్యం-అభివృద్ధి’ సదస్సులో ఆయన పాల్గొన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఆయా కార్యక్రమాల్లో జేపీ నడ్డా మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఎన్నో నిధులు ఇస్తున్నా రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వం తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి తరలిస్తూ ఒక ’ఏటీఎం’లా వాడుకుంటోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ఏటీఎంలాగా వాడుకుంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ పథకాలను వాడుకుంటుందని విమర్శించారు. రేవంత్‌రెడ్డి కేంద్రా న్ని బద్నాం చేయడం అలవాటు అయిందన్నారు.
కేంద్రం పన్నుల వాటా కింద తెలంగాణకు రూ.2.74 లక్షల కోట్లు, జాతీయ రహదారుల కోసం రూ.1.74 లక్షల కోట్లు, పవర్ ప్రాజెక్టుల కోసం రూ. 4,400 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని అంతర్గతంగా బలోపేతం చేస్తూనే, ప్రపంచవ్యాప్తంగా దేశ గౌరవాన్ని శిఖరాగ్రానికి చేర్చిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంన్నారు. గత 12 ఏళ్లలో ప్రధాని మోదీ వారసత్వ, తుష్టీకరణ రాజకీయాలకు స్వస్తి పలికి, ‘అభివృద్ధి ఆధారంగా భారత రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చారని కొనియాడారు.
పార్టీలో వ్యక్తిగత విభేదాలుండొద్దు
పార్టీలో వ్యక్తిగత విభేదాలను పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని జేపీ నడ్డా నేతలకు సూచించారు. ఈసారి తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణలో విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని బీజేపీ అనుకూలంగా మలుచుకోవాలని నేతలకు సూచించారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని పార్టీలోకి ఆహ్వానించాలని నడ్డా సూచించారు.






